ఉతికి ఆరేసిన బట్లర్‌, హేల్స్‌.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా | Sakshi
Sakshi News home page

AUS VS ENG 1st T20: ఉతికి ఆరేసిన బట్లర్‌, హేల్స్‌.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా

Published Sun, Oct 9 2022 6:09 PM

England Beat Australia By Eight Runs In First T20I - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌కు ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ జట్టుకు మాంచి బూస్ట్‌ అప్‌ విజయం దక్కింది. సిరీస్‌లో భాగంగా ఆతిధ్య జట్టుతో ఇవాళ (అక్టోబర్‌ 9) జరిగిన తొలి మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌ చేసిన ఇంగ్లండ్‌ ఎట్టకేలకు గెలుపొందింది.

బట్లర్‌, హేల్స్‌ విధ్వంసం..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్‌ హేల్స్‌ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరలెవెల్లో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.2 ఓవర్లలో 132 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు.

ఆఖర్లో క్రిస్‌ వోక్స్‌ (5 బంతుల్లో 13 నాటౌట్‌) బౌండరీ, సిక్సర్‌ బాదడంతో ఇంగ్లండ్‌ 200 స్కోర్‌ను క్రాస్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో స్వెప్సన్‌ 3, కేన్‌ రిచర్డ్‌సన్‌, డేనియల్‌ సామ్స్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చెలరేగిన వార్నర్‌, స్టోయినిస్‌.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా
209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్‌ మార్ష్‌ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్‌ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్‌ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.

అయితే ఆఖర్లో మార్క్‌ వుడ్‌ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్‌ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ ఆసీస్‌ పతనాన్ని శాశించగా.. రీస్‌ టాప్లే, సామ్‌ కర్రన్‌ తలో 2 వికెట్లు, ఆదిల్‌ రషీద్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. భారీ అర్ధశతకం సాధించి ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించడానికి పునాది వేసిన హేల్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సిరీస్‌లో తదుపరి మ్యాచ్‌ బుధవారం (అక్టోబర్‌ 12) జరుగనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement