
ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించిన అనంతరం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తుతూ సోషల్‌మీడియాలో ఓ కదిలించే పోస్ట్ పెట్టాడు. కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము. వెల్‌డన్ బాయ్స్ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.
ఈ మెసేజ్‌తో పాటు గంభీర్ టీమిండియా ఆటగాళ్లు విజయదరహాసంతో ఉన్న పలు ఫోటోలను పోస్ట్ చేశాడు. గంభీర్ చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

కాగా, ఇంగ్లండ్ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా చూపించిన పోరాటస్పూర్తిలో గంభీర్ ప్రధానపాత్ర పోషించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆశలు వదులుకోకూడదంటూ (Never give up) ఆటగాళ్లలో కసిని రగిల్చాడు.
మనది యంగ్ టీమ్ కాదు, గన్ టీమ్ అంటూ ఆటగాళ్లలో ఉత్తేజాన్ని నింపాడు. ఆటగాళ్లను ప్రతి విషయంలో దగ్గరుండి ప్రోత్సహించాడు. కొందరు ఆటగాళ్లు (ఆకాశ్‌దీప్, జైస్వాల్) విఫలమైప్పుడు వెనకేసుకొచ్చి సత్ఫలితాలు రాబట్టాడు.
అవసరమైనప్పుడు దండించాడు. మంచి ప్రదర్శన చేసినప్పుడు ముద్దులతో ముంచెత్తాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు స్పూర్తిదాతగా నిలిచాడు. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గంభీర్‌లోని చిన్నపిల్లాడు బయటికి వచ్చాడు. విజయగర్వంతో ఊగిపోతూ ఎగిరి గంతులేశాడు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ముద్దులతో ముంచెత్తాడు. టీమిండియా మొత్తాన్ని తీవ్ర భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. ముఖ్యంగా సిరాజ్‌పై ప్రశంసలపై వర్షం కురిపించాడు. అతన్ని కెప్టెన్‌తో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూర్చోబెట్టి కొత్త ఆనవాయితీకి తెరలేపాడు.
ఓవల్ టెస్ట్‌లో సిరాజ్ చారిత్రక స్పెల్‌తో భారత్‌కు అపురూప విజయాన్నందించాడు. చివరి రోజు 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. 3 వికెట్లు తీసి వారి నోటి కాడి విజయాన్ని లాక్కున్నాడు.
ఈ మ్యాచ్ మొత్తం అద్బుతమైన పోరాటాలతో సాగింది. తొలుత భారత్ స్వల్ప స్కోర్‌కే ఔటైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లండ్‌ను కూడా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్లు అద్భుతమే చేశారు.
జైస్వాల్, ఆకాశ్‌దీప్, జడేజా, సుందర్ సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించారు. అనంతరం 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలను వదులుకోకుండా పోరాడారు.
ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై ప్రతాపం చూపించారు. సిరాజ్, ప్రసిద్ద్ నిరుత్సాహపడకుండా వారు చేయాల్సిందంతా చేసి సత్పలితాన్ని రాబట్టారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది.