Dutch GP 2022: వెల్‌డన్‌ వెర్‌స్టాపెన్‌

Dutch GP: Max Verstappen wins Grand Prix to extend F1 lead - Sakshi

ఎఫ్‌1 సీజన్‌లో పదో విజయం

జాండ్‌వూర్ట్‌ (నెదర్లాండ్స్‌): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2022 సీజన్‌లో పదో విజయం నమోదు చేశాడు. సొంతగడ్డపై ఆదివారం జరిగిన డచ్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. జార్జి రసెల్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో, చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు.

ప్రపంచ మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 రేసులు పూర్తయ్యాయి. వెర్‌స్టాపెన్‌ 319 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా గెలుపుతో వెర్‌స్టాపెన్‌ వరుసగా రెండో ఏడాదీ 10 విజయాలు సాధించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ; 2004లో 13), సెబాస్టియన్‌ వెటెల్‌ (జర్మనీ; 2013లో 13) పేరిట సంయుక్తంగా ఉంది. 201 పాయింట్లతో చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ), సెర్గియో పెరెజ్‌ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి ఈనెల 11న జరుగుతుంది.   

విజేత వెన్నెల–శ్రియాన్షి జోడీ
పుణే: ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నీలో కలగొట్ల వెన్నెల–శ్రియాన్షి వలిశెట్టి (భారత్‌) జోడీ అండర్‌–19 మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వెన్నెల–శ్రియాన్షి ద్వయం 21–19, 21–18తో నర్దన–రిధి కౌర్‌ (భారత్‌) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఉన్నతి హుడా (భారత్‌) 25–23, 17–21, 10–21తో సరున్‌రక్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో దివ్యం అరోరా–రిధి కౌర్‌ (భారత్‌) జోడీ టైటిల్‌ దక్కించుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top