
ధోని రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు వికెట్‌కీపింగ్ బ్యాటర్ స్థానాన్ని రిషబ్ పంత్ సుస్థిరం చేసుకున్నాడు. మధ్యలో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌కు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. పంత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టినా.. అది తాత్కాలికమే. భారత మేనేజ్‌మెంట్ రాహుల్‌ను టెస్ట్‌ల్లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే పరిగణిస్తుంది.
ప్రస్తుతానికి భారత టెస్ట్ జట్టులో పంత్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే మధ్యమధ్యలో అతని గాయాలే మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో పంత్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండగా గాయపడ్డాడు. ఆ సిరీస్‌లో పంత్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా ధృవ్ జురెల్ ఉండటంతో టీమిండియాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. చివరి టెస్ట్‌లో జురెల్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు.
ఇంత వరకు అంతా బాగానే ఉంది. పంత్ అందుబాటులో లేనప్పుడే జురెల్‌కు అవకాశాలు వస్తున్నాయి. అయితే తాజాగా జురెల్ ఆస్ట్రేలియా-ఏపై చేసిన అద్భుత శతకం టీమిండియాలో పంత్ స్థానాన్ని ఛాలెంజ్ చేస్తుంది.
ఆసీస్-ఏపై జురెల్ ఏదో గాలివాటంగా సెంచరీ చేయలేదు. పక్కా ప్రణాళిక ప్రకారం, భారత టెస్ట్ జట్టులో స్థానమే లక్ష్యంగా చేసిన సెంచరీలా ఉందది. గత కొంతకాలంగా జురెల్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నాడు. అయితే పంత్ ఫామ్‌లో ఉండటంతో వాటికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.
జురెల్ తాజా సెంచరీ మాత్రం అలా కాదు. ఈ సెంచరీకి చాలా విలువ ఉంది. జురెల్ సరైన సమయంలో శతక్కొట్టి పంత్ స్థానానికి ఛాలెంజ్ విసిరాడు. త్వరలో (అక్టోబర్ 2) భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు గట్టిగా 10 రోజుల సమయం మాత్రమే ఉంది.
పంత్ ఇప్పటికి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో సెలెక్టర్లకు జురెల్ తప్పక మొదటి ప్రాధాన్యత అవుతాడు. జురెల్ విండీస్ సిరీస్‌లో సాధారణ ప్రదర్శనలతో మమ అనిపిస్తే ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ అతను ఆ సిరీస్‌లో ఎప్పటిలాగే చెలరేగితే మాత్రం పంత్‌కు డేంజర్ బెల్స్ మోగినట్లే.
ఎందుకంటే ఇప్పటిదాకా సెలెక్టర్లకు పంత్ మాత్రమే ఛాయిస్‌గా ఉన్నాడు. విండీస్‌తో సిరీస్‌లో జురెల్ రాణిస్తే.. వారి ఛాయిస్ తప్పక మారుతుంది. ఎందుకంటే జురెల్ ఒకటి అరా మ్యాచ్‌ల్లో రాణించిన ఆటగాడు కాదు. అతను సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎక్కడ ఆడినా అద్భుతాలే చేశాడు. ముఖ్యంగా భారత-ఏ జట్టు తరఫున అతని రికార్డు అత్యద్భుతంగా ఉంది.
ఆసీస్-ఏపై సెంచరీకి ముందు జురెల్ ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్ లయన్స్‌పై 94(120), 53*(53) & 52(87),
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా-ఏపై 80(186) & 68(122),
భారత్‌లో ఇంగ్లండ్ లయన్స్‌పై 50(38),
సౌతాఫ్రికాలో సౌతాఫ్రికా-ఏపై 69(166) స్కోర్లు చేశాడు. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డుతో జురెల్ తప్పక పంత్‌కు ప్రత్యామ్నాయం అవుతాడు. కాబట్టి పంత్ ఇకపై జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అతని స్థానాన్ని జురెల్ ఎగరేసుకుపోవడం ఖాయం.