CWC Qualifier 2023: Zimbabwe Beat West Indies By 35 Runs - Sakshi
Sakshi News home page

పెను సంచలనం.. విండీస్‌ను మట్టికరిపించిన పసికూన

Published Sat, Jun 24 2023 8:42 PM

CWC Qualifier 2023: Zimbabwe Beat West Indies By 35 Runs - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. టూ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్‌ 24) జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో జింబాబ్వే.. తమకంటే ఎన్నో రెట్లు పటిష్టమైన వెస్టిండీస్‌ను 35 పరుగుల తేడాతో ఓడించింది. సికందర్‌ రజా (68, 2/45) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో, టెండాయ్‌ చటార (3/52), బ్లెస్సింగ్‌ ముజరబాని (2/33), రిచర్డ్‌ నగరవ (2/25) అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. సికందర్‌ రజాతో పాటు ర్యాన్‌ బర్ల్‌ (50), క్రెయిగ్‌ ఎర్విన్‌ (47) రాణించగా.. గుంబీ (26), సీన్‌ విలియమ్స్‌ (23) పర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్లలో కీమో పాల్‌ 3, అల్జరీ జోసఫ్‌, అకీల్‌ హొసేన్‌ చెరో 2, కైల్‌ మేయర్స్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. ఆదిలోనే తడబడింది. ఆ జట్టు 46 పరుగులకే 2 వికెట్లు (బ్రాండన్‌ కింగ్‌ (20), జాన్సన్‌ ఛార్లెస్‌ (1)) కోల్పోయింది. కైల్‌ మేయర్స్‌ (56), షాయ్‌ హోప్‌ (30), పూరన్‌ (34), రోస్టన్‌ ఛేజ్‌ (44) విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లు క్రమంగా వికెట్లు పడగొట్టడంతో విండీస్‌ ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఆ జట్టు 44.4 ఓవర్లలో 233 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సికందర్‌ రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement