హమ్మయ్య... మా వాళ్లకు నెగెటివ్‌ 

CSK Players Tested Negative Of Coronavirus - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెల్లడి

రేపు మరో దఫా పరీక్షలు 

న్యూఢిల్లీ: యూఏఈ వెళ్లగానే కరోనా మహమ్మరి ఉచ్చులో విలవిలలాడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు ఊరటనిచ్చే ఫలితాలొచ్చాయి. కరోనా బారిన పడిన క్రికెటర్లు దీపక్‌ చహర్, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మందికి తాజా కోవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చెన్నై సీఈఓ కా శీ విశ్వనాథన్‌ మంగళవారం వెల్లడించారు. ‘ఔను... వాళ్లందరికీ ఇప్పుడు నెగెటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారీ చేసే పరీక్షలో కూడా నెగెటివ్‌ నిర్ధారణ కావాల్సి వుంటుంది. రెండో దఫా కోవిడ్‌ పరీక్షల్ని గురువారం చేస్తారు. అందులోనూ బయటపడితే 4వ తేదీ నుంచి నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తారు’ అని ఆయన చెప్పారు. 

20 వేలకుపైగా టెస్టులు...  రూ. 10 కోట్ల ఖర్చు! 
సుమారు రెండు నెలల పాటు యూఏఈలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌ కోసం 20 వేల పైచిలుకు పరీక్షల కోసం బీసీసీఐ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. అక్కడికి బయల్దేరడానికి ముందు చేయించిన పరీక్షలకైతే ఆయా ఫ్రాంచైజీలే భరించాయి. కానీ యూఏఈ చేరాక ఈ బాధ్యత బీసీసీఐది. దీంతో గత నెల 20 నుంచి టెస్టుల కోసం ఆర్టీ–పీసీఆర్‌ కిట్లు వినియోగిస్తోంది. 
 దీనిపై బోర్డుకు చెందిన ఐపీఎల్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘టెస్టుల కోసం యూఏఈకి చెందిన వీపీఎస్‌ హెల్త్‌కేర్‌తో ఒప్పందం చేసుకున్నాం. 20 వేలకు పైగా టెస్టులు చేయాల్సిరావచ్చు. ఒక్కో టెస్టు కోసం 200 దిర్హమ్‌ (రూ.3978) ఖర్చు పెడుతున్నాం’ అని అన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top