IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్‌! | CSK IPL 2026 Playoff Push Takes Big Hit As Star Player Returns Home Due To This Reason, Read Story For More Details | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేకు భారీ షాక్‌!.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

May 14 2026 10:38 AM | Updated on May 14 2026 12:14 PM

CSK IPL 2026 Playoff push takes big hit as star player returns home

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్య ఓవర్లలో జట్టుకు కీలకంగా మారిన.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ స్వదేశానికి పయనమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్‌-2026 టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

స్పందించిన ఫ్రాంఛైజీ
ఈ విషయంపై చెన్నై యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘జేమీ ఓవర్టన్‌ (Jamie Overton) కుడి తొడకు గాయమైంది. అతడు యూకేకు వెళ్లిపోతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గాయంపై స్పష్టత వస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్‌-2026లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై జట్టు.. ఆరింట గెలిచింది.

కీలక ఆల్‌రౌండర్‌గా
తద్వారా 12 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కీలక ఆల్‌రౌండర్‌ అయిన ఓవర్టన్‌ గాయం వల్ల జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికి 10 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌.. 14 వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. 136 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే.. సీజన్‌ ఆరంభం నుంచి చెన్నైని గాయాల బెడద వేధిస్తోంది. జట్టు దిగ్గజ సారథి, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల ఇప్పటికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక పేసర్‌ రామకృష్ణ ఘోష్‌ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.

ప్లే ఆఫ్స్‌ రేసులోకి వచ్చిన వేళ.. భారీ షాక్‌!
అంతకు ముందే పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, ఆయుశ్‌ మాత్రే, నాథన్‌ ఎల్లిస్‌.. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యారు. 

కాగా టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై.. అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకువచ్చింది. ఇలాంటి కీలక సమయంలో ఓవర్టన్‌ జట్టుకు దూరం కావడంతో భారీ షాక్‌ తగిలినట్లయింది.

ఇక ఇప్పటికి 11 మ్యాచ్‌లలో 430 పరుగులు సాధించి సంజూ శాంసన్‌ చెన్నై తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉండగా.. పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ 19 వికెట్లు కూల్చి టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

Advertisement
 
Advertisement
Advertisement