
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ ప్రారంభానికి ముందు సెయింట్ లూసియా కింగ్స్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకుంది. గత సీజన్‌లో కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఫాఫ్ డుప్లెసిస్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో కింగ్స్ మేనేజ్‌మెంట్ నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. వీస్ 2021 ఎడిషన్ నుంచి కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఈ ఫ్రాంచైజీ తరఫున 26 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీసి, 338 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌కు ముందు కింగ్స్ టిమ్ డేవిడ్, తబ్రేజ్ షంషి లాంటి స్టార్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. అలాగే మీకా మెకెంజీ, జావెల్ గ్లెన్ లాంటి కొత్త ముఖాలను జట్టులో చేర్చుకుంది. గత సీజన్ ఫైనల్లో కింగ్స్ నాటి డిఫెండింగ్ ఛాంపియన్ గయనా అమెజాన్ వారియర్స్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ సీజన్ సీపీఎల్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. లూసియా కింగ్స్ ఆగస్ట్ 17న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కింగ్స్ ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో తలపడనుంది.
కాగా, సెయింట్ లూసియా కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అండర్‌లో నడుస్తుంది. లూసియా కింగ్స్‌కు బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తుంది.
సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్ : టిమ్ డేవిడ్, అల్జరి జోసఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంషి, డేవిడ్ వీస్ (కెప్టెన్), డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే