గార్సియా గుడ్‌బై.. అదే లాస్ట్‌ | Caroline Garcia Set To Retire From Tennis | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌కు కరోలినా గార్సియా వీడ్కోలు

May 24 2025 12:05 PM | Updated on May 24 2025 1:11 PM

Caroline Garcia Set To Retire From Tennis

కరోలినా గార్సియా (Image @CaroGarcia)

ఫ్రెంచ్‌ ఓపెనే తన చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అని ప్రకటించిన ఫ్రాన్స్‌ టెన్నిస్‌ స్టార్‌  

పారిస్‌: డబుల్స్‌లో రెండుసార్లు సొంతగడ్డపై ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన ఫ్రాన్స్‌ మహిళా టెన్నిస్‌ స్టార్‌ కరోలినా గార్సియా (Caroline Garcia)... తన కెరీర్‌లో చివరిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడనుంది. ఆదివారం నుంచి మొదలయ్యే టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆఖరిసారి బరిలోకి దిగుతున్నానని 31 ఏళ్ల గార్సియా శుక్రవారం ప్రకటించింది.

2016లో, 2022లో ఫ్రాన్స్‌కే చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్‌తో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్స్‌ సాధించిన గార్సియాకు సింగిల్స్‌ అంతగా కలిసి రాలేదు. వరుసగా 14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా 2017లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కెరీర్‌ మొత్తంలో 51 గ్రాండ్‌స్లామ్‌ టోర్నిలలో సింగిల్స్‌ విభాగంలో ఆడిన గార్సియా ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్‌ దశకు (2022 యూఎస్‌ ఓపెన్‌) చేరుకోగలిగింది. 2018లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ నాలుగో స్థానాన్ని అందుకున్న గార్సియా 2022లో కాలి గాయంతో కొంతకాలం ఆటకు దూరమైంది. ఈ గాయం నుంచి తేరుకున్నాక గార్సియా అదే ఏడాది నాలుగు టైటిల్స్‌ సొంతం చేసుకోవడం విశేషం.

‘వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 15 ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో నిర్విరామంగా ఆడుతున్నాను. గత 25 ఏళ్లుగా ప్రతి క్షణం టెన్నిస్‌కే అంకితం చేశాను. ఇప్పుడు టెన్నిస్‌కు స్వస్తి చెప్పి కొత్త అధ్యాయం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఫ్రెంచ్‌ ఓపెన్‌ (French Open) తర్వాత ఒకట్రెండు టోర్నిలు ఆడి ఆటకు గుడ్‌బై చెబుతాను’ అని గార్సియా తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 145వ స్థానంలో ఉన్న గార్సియా ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో బెర్నార్డా పెరాతో ఆడుతుంది.  

చ‌ద‌వండి: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌

11- కెరీర్‌లో గార్సియా సాధించిన సింగిల్స్‌ టైటిల్స్‌.  
8- కెరీర్‌లో గార్సియా నెగ్గిన డబుల్స్‌ టైటిల్స్‌ 
35- ఓవరాల్‌గా సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో గార్సియా ఫైనల్‌ చేరిన టోర్నిల సంఖ్య 
471- సింగిల్స్‌లో గార్సియా గెలిచిన మ్యాచ్‌లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement