
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. బులవాయో వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టేలర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో టేలర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
21వ శతాబ్దంలో లాంగెస్ట్ టెస్టు క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా టేలర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 2004లో జింబాబ్వే తరపున అరంగేట్రం చేసిన బ్రెండన్.. ఇప్పటివరకు 21 ఏళ్ల 93 రోజుల పాటు టెస్టుల్లో కొనసాగాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది.
ఆండర్సన్ తన కెరీర్‌లో 21 ఏళ్ల 51 రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడాడు. తాజా మ్యాచ్‌తో ఆండర్సన్ ఆల్‌టైమ్ రికార్డును టేలర్ బ్రేక్ చేశాడు. కాగా 39 ఏళ్ల టేలర్‌పై 2022లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేదం విధించింది. ఓ వ్యాపారవేత్త నుండి బహుమతులు తీసుకోవడంతో అతడిపై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పుడు ఐసీసీ అతడిపై బ్యాన్ ఎత్తేయడంతో రీఎంట్రీ ఇచ్చాడు.
కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లు సాధించాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిసాగా(33) రాణించారు.