
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాటిదార్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.
ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ సాధించాడు.
ఇక పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు కూల్చాడు.
అతిపెద్ద గుణపాఠం
ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar).. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.
ఇలాంటి మ్యాచ్‌లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్‌లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.
పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్‌ను ఆడించలేదు. ఇక వికెట్ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.
క్రెడిట్ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్
ఈ విజయంలో క్రెడిట్ పంజాబ్ బౌలర్లకే దక్కుతుంది. వికెట్ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు.
కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.
కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో హోం గ్రౌండ్‌లో అత్యధిక మ్యాచ్‌లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్
👉టాస్: పంజాబ్ కింగ్స్.. మొదట బౌలింగ్
👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)
👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 98/5 (12.1)
👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్).
.@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️
They continue their winning streak with an all-round show over #RCB 👏
Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025
చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా