అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చారిత్రత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను చేర్చేందుకు ఐసీసీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో తొమ్మిది జట్లు పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను పన్నెండుకు పెంచేందుకు ఐసీసీ సిద్దమైంది. దీంతో డబ్ల్యూటీసీ 2027-29 సైకిల్‌లో అఫ్గాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా చేరనున్నాయి. ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్‌లో మాత్రం చోటు దక్కలేదు.
ఇప్పుడు తొలిసారి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిష్‌లో ఈ మూడు జట్లు పోటీపడనున్నాయి. కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం.. డబ్ల్యూటీసీలో చేరాంటే కనీసం రెండు టెస్టు సిరీస్‌లైనా ఆడాలి. కానీ ఇప్పుడు 12 జట్లను చేర్చాలని నిర్ణయించడంతో.. కనీసం ఒక్క టెస్టు సిరీస్ ఆడినా కూడా సదరు జట్టుకు డబ్ల్యూటీసీలో భాగమయ్యే అవకాశం లభిస్తోంది. అయితే ఈ నిబంధన 2027-29 సైకిల్ నుంచి అమలులోకి రానుంది.
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ బృందం ఈ కొత్త మోడల్‌పై కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ త్వరలోనే తుది సిఫార్సులను ఐసీసీ అందించే అవకాశం ఉంది. కాగా కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్‌లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.
విజేతలు వీరే
తొలి సీజన్‌లో భారత్- న్యూజిలాండ్ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్ తలపడగా.. కేన్ విలియమ్సన్ బృందం విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లి సేన రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్‌లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది.
చదవండి: IPL 2026: లక్నో జట్టులోకి సౌతాఫ్రికా సూపర్ స్టార్


