WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్‌ సైన్యం

BCCI to increase focus on player fitness ahead of ODI World Cup - Sakshi

మళ్లీ యో–యో టెస్టు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు అమిత ప్రాధాన్యం

బీసీసీఐ ఉన్నతస్థాయి సమావేశం  

ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్‌నెస్‌ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్‌కప్‌తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్‌ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్‌ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్‌లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.

► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ
పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు.  

► కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్‌ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు.  

► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్‌ల నేపథ్యంలో జట్టు సెలక్షన్‌ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి.        

► ఎమర్జింగ్‌ ప్లేయర్లు ఐపీఎల్‌తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు.  
► ప్రపంచకప్‌కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్‌నెస్‌తో మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ    జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్‌ భారం, ఒత్తిడి, మెంటల్‌ కండిషనింగ్, ఫిట్‌నెస్‌ అంశాల్ని ఇందులో చర్చించారు.

► మంచి ఆల్‌రౌండర్‌ అవుతాడనుకున్న దీపక్‌ చహర్, భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

► అవసరమైతే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌        (ఐపీఎల్‌) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు    అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ టోర్నీ సమయంలో తమ స్టార్‌ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు.
► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్‌ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు.
► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ ఈ కీలక మీటింగ్‌లో పాల్గొనడం గమనార్హం.

20 మందితో ప్రపంచకప్‌ సైన్యం...
సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే ప్రపంచకప్‌ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్‌ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్‌ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top