ఢాకా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక పాక్ జట్టు 52.5 ఓవర్లలో 163 రన్స్‌కే కుప్పకూలింది. బంగ్లా పేసర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటర్లు విలవిల్లాడారు.
ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 9.5 ఓవర్లలోనే 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ బ్యాటర్లలో అబ్దుల్లా ఫజల్(66) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(101) సెంచరీతో కదం తొక్కగా..మోమినల్ హక్(91), ముష్ఫికర్ రహీమ్(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ కూడా ధీటుగా బదులిచ్చింది.
అరంగేట్ర ఆటగాడు అజాన్ అవైస్(103) శతక్కొట్టగా.. అబ్దుల్లా ఫజల్(60), సల్మాన్ అలీ అఘా(58), మహ్మద్ రిజ్వాన్(59) రాణించారు. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్ల సత్తాచాటాడు. 17 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాకిస్తాన్ చతికిలబడింది. కాగా బంగ్లాదేశ్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో పాకిస్తాన్ ఓడించడం ఇదే తొలిసారి.
బంగ్లా జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మొట్టమొదటి టెస్టు 2002లో ఆడింది. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై పాక్‌పై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ మ్యాచ్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!


