క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు! | 822 runs in 50 overs and win margin of 794: Zimbabwe domestic cricket match | Sakshi
Sakshi News home page

క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!

May 12 2026 5:08 PM | Updated on May 12 2026 5:28 PM

822 runs in 50 overs and win margin of 794: Zimbabwe domestic cricket match

సాధారణంగా 50 ఓవర్ల క్రికెట్‌లో ఓ జట్టు 400 పరుగులు సాధిస్తే అతి భారీ స్కోర్‌గా చెప్పుకుంటాం. అటువంటిది జింబాబ్వే వేదికగా జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఓ జట్టు ఏకంగా 822 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

మాస్వింగో 50 ఓవర్ల ఫస్ట్ లీగ్‌లో భాగంగా సోమ‌వారం స్కోర్పియన్ క్రికెట్ క్లబ్, మీథేన్ లయన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన  స్కోర్పియన్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 822 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

ఓపెనర్లు విల్ఫ్రెడ్ మాటెండే, తకుండా మడెంబో ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశారు. వారిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు. వారి విధ్వంసం ధాటికి ఫీల్డ‌ర్లు కేవ‌లం ప్రేక్ష‌క పాత్ర పోషించారు. తకుండా మడెంబో (143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్స్‌లతో 302) ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా..  విల్ఫ్రెడ్ మాటెండే(75 బంతుల్లో 23 ఫోర్లు, 13 సిక్స్‌లతో 203) ద్విశతకం బాదాడు. వీరిద్దరితో పాటు గార్భియల్‌ జయ(49 బంతుల్లో 110) మెరుపు సెంచరీ సాధించాడు.

కుప్పకూలిన మీథేన్‌
అనంతరం 822 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మీథేన్ లయన్స్ జట్టు, కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. దీంతో స్కోర్పియన్ క్రికెట్ క్లబ్ ఏకంగా 794 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ ఇది అధికారిక 'లిస్ట్ ఏ' మ్యాచ్ అయ్యుంటే, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక తిరుగులేని రికార్డుగా నిలిచిపోయేది.
చదవండి: Shreyas Iyer: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
 

Advertisement
 
Advertisement
Advertisement