బెంగళూరు వీరంగం | Royal Challengers Bengaluru Beat Chennai Super Kings By 43 Runs, Check Out Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

బెంగళూరు వీరంగం

Apr 6 2026 4:00 AM | Updated on Apr 6 2026 3:39 PM

Bangalore beat Chennai Super Kings by 43 runs

ఆర్‌సీబీ ఖాతాలో రెండో విజయం 

టిమ్‌ డేవిడ్, పాటీదర్, పడిక్కల్‌ మెరుపులు

చెన్నైకు వరుసగా మూడో ఓటమి

బెంగళూరు: టాపార్డర్‌ దుమ్మురేపడంతో... ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయం సాధించింది. ఐదుసార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 43 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. 

టిమ్‌ డేవిడ్‌ (25 బంతుల్లో 70 నాటౌట్‌; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (19 బంతుల్లో 48 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... దేవదత్‌ పడిక్కల్‌ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కొండంత లక్ష్యఛేదనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నై చివరకు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. 

సర్ఫరాజ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 50; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తా చాటగా... కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (7), సంజూ సామ్సన్‌ (9), ఆయుశ్‌ మాత్రే (1), కార్తీక్‌ శర్మ (6), శివమ్‌ దూబే (18) విఫలమయ్యారు. ప్రశాంత్‌ వీర్‌ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జేమీ ఓవర్టన్‌ (16 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్‌ 3 వికెట్లు పడగొట్టాడు.  

10 ఓవర్లలో 91/1 
ఇన్నింగ్స్‌ ఆరంభంలో బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో బెంగళూరు నెమ్మదిగా ఆడింది. గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లి (18 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసిన బెంగళూరు... సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 91/1తో నిలిచింది. కాసేపటికే సాల్ట్‌ కూడా అవుట్‌ కాగా... ఆ తర్వాత ఆర్‌సీబీ విధ్వంసం మొదలైంది. 

చివరి 5 ఓవర్లలో 97 పరుగులు 
నూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో పాటీదార్, పడిక్కల్‌ చెరో సిక్స్‌తో 16 పరుగులు రాబట్టగా... దూబే వేసిన తదుపరి ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌ అవుట్‌ కాగా... టిమ్‌ డేవిడ్‌ రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు పాటీదార్‌ సిక్స్‌ల వర్షం కురిపిస్తుంటే... మరోవైపు డేవిడ్‌ బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. 

నూర్‌ అహ్మద్‌ వేసిన 17వ ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’ సిక్స్‌లు బాదిన అతడు... తదుపరి ఓవర్‌లో 4, 6 కొట్టాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ కాగా... అన్షుల్‌ వేసిన ఆ బంతి నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. ఓవర్టన్‌ వేసిన 19వ ఓవర్‌లో డేవిడ్‌ వరుసగా 6, 2, 4, 6, 6, 6 కొట్టడంతో స్టేడియం మోత మోగిపోయింది. డేవిడ్‌ 21 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్‌ చేరాడు. 

చివరి ఓవర్‌లో మరో 6, 4తో బెంగళూరు ఈ సీజన్‌లో తొలిసారి 250 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పాటీదార్, పడిక్కల్‌ మూడో వికెట్‌కు 21 బంతుల్లో 58 పరుగులు జోడించగా... పాటీదార్, డేవిడ్‌ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 99 పరుగులు జతచేశారు. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 97 పరుగులు రాబట్టడం విశేషం.  

202 ఐపీఎల్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తీసిన వికెట్లు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్‌ (224) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భువీ రెండో స్థానంలో ఉన్నాడు.

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) నూర్‌ (బి) దూబే 46; కోహ్లి (సి) దూబే (బి) అన్షుల్‌ 28; పడిక్కల్‌ (బి) ఓవర్టన్‌ 50; పాటీదార్‌ (నాటౌట్‌) 48; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 70; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 250. వికెట్ల పతనం: 1–37, 2–93, 3–151. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–37–0; హెన్రీ 3–0–36–0; అన్షుల్‌ 4–0–52–1; నూర్‌ 4–0–49–0; ఓవర్టన్‌ 3–0–42–1; శివమ్‌ దూబే 2–0–30–1. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) పడిక్కల్‌ (బి) డఫీ 9; రుతురాజ్‌ (సి) పడిక్కల్‌ (బి) డఫీ 7; ఆయుశ్‌ (సి) పాటీదార్‌ (బి) భువనేశ్వర్‌ 1; సర్ఫరాజ్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) కృనాల్‌ 50; కార్తీక్‌ (సి) అభినందన్‌ (బి) కృనాల్‌ 6; శివమ్‌ దూబే (సి) జితేశ్‌ (బి) అభినందన్‌ 18; ప్రశాంత్‌ (సి) పాటీదార్‌ (బి) భువనేశ్వర్‌ 43; ఓవర్టన్‌ (సి) (సబ్‌) బెథెల్‌ (బి) సుయాశ్‌ 37; అన్షుల్‌ (నాటౌట్‌) 19; నూర్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 8; హెన్రీ (సి) సాల్ట్‌ (బి) అభినందన్‌ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 207. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–77, 5–84, 6–108, 7–165, 8–178, 9–190, 10–207. బౌలింగ్‌: డఫీ 4–0–58–2; భువనేశ్వర్‌ 4–0–41–3; అభినందన్‌ 3.4–0–30–2; కృనాల్‌ 3–0–36–2; సుయాశ్‌ 4–0–21–1; షెఫర్డ్‌ 1–0–19–0;  

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X పంజాబ్‌   
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement