భారత మహిళల విజయగర్జన | Sakshi
Sakshi News home page

భారత మహిళల విజయగర్జన

Published Sat, Jan 6 2024 3:43 AM

Australia lost the first T20 by 9 wickets - Sakshi

ముంబై: ఆ్రస్టేలియా మహిళలతో వన్డే సిరీస్‌ను 0–3తో చేజార్చుకున్న భారత జట్టు టి20 సిరీస్‌లో మెరుపు విజయంతో శుభారంభం చేసింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేసిన మన జట్టు... ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబర్చింది.  శుక్రవారం డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన తొలి టి20లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. 2020 టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ జట్టు మళ్లీ ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి.

ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (32 బంతుల్లో 49 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలైస్‌ పెరీ (30 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో ఆసీస్‌ ఇబ్బందుల్లో పడిన స్థితిలో లిచ్‌ఫీల్డ్, పెరీ ఐదో వికెట్‌కు 52 బంతుల్లోనే 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యువ పేస్‌ బౌలర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టిటాస్‌ సాధు (4/17) పదునైన బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా... శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 145 పరుగులు చేసి గెలిచింది.

షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్మృతి మంధాన (52 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 93 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే 14 పరుగులు రావడంతో మొదలైన ఛేదనలో చివరి వరకు భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా గత రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షఫాలీ ఇప్పుడు మళ్లీ అవకాశం రాగానే చెలరేగిపోయింది.

విజయానికి ఐదు పరుగుల దూరంలో స్మృతి వెనుదిరిగినా... షఫాలీతో కలిసి జెమీమా (6 నాటౌట్‌) మ్యాచ్‌ ముగించింది. సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజలో నిలవగా, రెండో మ్యాచ్‌ ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో స్మృతి అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకొని హర్మన్‌ప్రీత్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచింది.   

Advertisement
 
Advertisement