
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా అద్భుతమైన విజయంతో ముగించింది. మంగళవారం సెయింట్ కిట్స్ వేదికగా విండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను కంగారులు వైట్ వాష్ చేశారు.
ఈ ఆఖరి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 19.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫెన్ రూథర్ ఫర్డ్(35), హోల్డర్(20) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లీస్ రెండు వికెట్లు సాధించారు.
వీరిద్దరితో పాటు మాక్స్‌వెల్, జంపా, అబాట్, హార్దీ తలా వికెట్ సాధించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలోనే చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ ఓవెన్(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్రీన్(32), హార్దీ(28 నాటౌట్), డేవిడ్(30) రాణించారు.
విండీస్ బౌలర్లు మరోసారి ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. అకిల్ హోస్సేన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు. హోల్డర్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా ఆస్ట్రేలియా చేతిలో విండీస్.. టెస్టు, టీ20 సిరీస్‌లలోనూ వైట్‌వాష్ అయింది.
చదవండి: IND vs ENG: ఆఖరి టెస్టులో బుమ్రా ఆడుతాడా? కీలక అప్‌డేట్ ఇచ్చిన గంభీర్