AUS VS WI 1st Test: అశ్విన్‌ను వెనక్కునెట్టిన ఆసీస్‌ స్పిన్నర్‌.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 8వ బౌలర్‌గా..!

AUS VS WI 1st Test: Nathan Lyon Surpasses Ashwin To Become 8th Highest Wicket Taker In Test Cricket - Sakshi

ఆస్ట్రేలియా వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. పెర్త్‌ వేదికగా వెస్డిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్లు (2/61, 6/128) పడగొట్టిన లయోన్‌.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ఏస్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను (86 టెస్ట్‌ల్లో 442 వికెట్లు) అధిగమించాడు. కెరీర్‌లో 111 టెస్ట్‌లు ఆడిన లయోన్‌ ఖాతాలో ప్రస్తుతం 446 వికెట్లు ఉన్నాయి.

టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీథరన్‌ (133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ (145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు), ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ (178 మ్యాచ్‌ల్లో 668 వికెట్లు), భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే (132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు), ఇంగ్లండ్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (159 మ్యాచ్‌ల్లో 566 వికెట్లు), ఆసీస్‌ లెజెండరీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (124 టెస్ట్‌ల్లో 563 వికెట్లు), విండీస్‌ గ్రేట్‌ వాల్ష్‌ (132 టెస్ట్‌ల్లో 519 వికెట్లు) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో మార్నస్‌ లబూషేన్‌ (204, 104 నాటౌట్‌), స్టీవ్‌ స్మిత్‌ (200 నాటౌట్‌, 20 నాటౌట్‌), నాథన్‌ లయోన్‌ (2/61, 6/128) చెలరేగడంతో ఆతిధ్య ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ డబుల్‌ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (65) అర్ధసెంచరీతో రాణించగా.. ట్రావిస్‌ హెడ్‌ (99) పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌.. మిచెల్‌ స్టార్క్‌ (3/51), పాట్‌ కమిన్స్‌ (3/34), లయోన్‌ (2/61) ధాటికి 283 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (64), టగెనరైన్‌ చంద్రపాల్‌ (51) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ మరోసారి సెంచరీతో రెచ్చిపోవడంతో ఆ జట్టు 182/2 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి ప్రత్యర్ధికి 498 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఛేదనలో లయోన్‌ తిప్పేయడంతో విండీస్‌ 333 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్‌ 164 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (110) శతకంతో రాణించగా, రోస్టన్‌ ఛేజ్‌ (55) అర్ధసెంచరీతో పర్వాలేదనిపించాడు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో తదుపరి మ్యాచ్‌ అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభమవుతుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top