వ్యక్తిగత కోచ్‌ల కోసం అథ్లెట్ల డిమాండ్‌ | Athletes demand for personal coaches | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత కోచ్‌ల కోసం అథ్లెట్ల డిమాండ్‌

Mar 27 2026 2:43 AM | Updated on Mar 27 2026 2:43 AM

Athletes demand for personal coaches

అందరికీ సర్దుబాటు చేయలేమన్న క్రీడాశాఖ  

న్యూఢిల్లీ: ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత అథ్లెట్లందరూ మాకంటే... మాకు వ్యక్తిగత కోచ్‌లు కావాలని కేంద్ర క్రీడా శాఖను డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు స్పష్టమైన సమాధానమిచ్చారు. అందరికీ వ్యక్తిగత కోచ్‌లను సర్దుబాటు చేయడం అసాధ్యమని కొట్టిపారేశారు. ఈ సెపె్టంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌లోని ఐచి నగొయాలో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు భారత్‌ 700 మంది పైచిలుకు అథ్లెట్ల బృందంతో అక్కడికి వెళ్లనుంది. 

ఈ క్రీడాకారులతో పాటు 33 శాతానికి మించకుండా సహాయక సిబ్బందిని ఆసియా ఒలింపిక్‌ మండలి (ఓసీఏ) అనుమతిస్తుంది. కానీ భారత క్రీడకారులేమో వ్యక్తిగత కోచ్‌ల కోసం పట్టుబడుతుండటంతో ఈ సంఖ్య ఏకంగా అథ్లెట్ల బృందాన్ని మించనుంది. ఈ నేపథ్యంలోనే క్రీడాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా వ్యక్తిగత కోచ్‌ల అంశంపైనే చర్చించారు. అందరు డిమాండ్‌ చేస్తున్నట్లుగా వ్యక్తిగత కోచ్‌లను అనుమతించలేమని క్రీడాశాఖ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. 

గతంలో ఒకరి వద్ద ఏళ్ల తరబడి కోచింగ్‌ తీసుకున్నప్పటికీ మెగా ఈవెంట్ల కోసం వేరే కోచ్‌ల మార్గదర్శనంలో పోటీలకు వెళ్లడం పరిపాటి. అంటే ఒకరొకరికి కాకుండా కొంత మందికి కలిపి ఫలానా కోచ్‌ అని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ), క్రీడాశాఖ ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సారి మాత్రం వ్యక్తిగత కోచ్‌లే కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ దృష్టిసారించింది. 

ఈ సందర్భంగా క్రీడాశాఖ వర్గాలు కచ్చితంగా పతకాలు తెస్తారనే అథ్లెట్లకు మాత్రమే వ్యక్తిగత కోచ్‌లను సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశాయి. మిగతా వారికి కావాలంటే సరైన కారణాలు వివరించాలని, దీనిపై మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ ఏకీభవిస్తేనే కోచ్‌లను ఏర్పాటు చేస్తామని కేంద్ర క్రీడాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement