
ఆసియా కప్ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఫాస్ట్‌బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉన్న ఆల్‌టైమ్ ఆసియా కప్ టీ20 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.
రెండు వికెట్లు పడగొట్టిన రషీద్
బంగ్లాదేశ్‌తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడింది. అబుదాబిలో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లు సైఫ్ హసన్ (30), తాంజిద్ హసన్ (52)లతో పాటు తౌహీద్ హృదోయ్ (26) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు స్కోరు చేసింది. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో అఫ్గన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో 26 పరుగులు ఇచ్చి.. సైఫ్ హసన్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోవడంతో పాటు షమీమ్ హొసేన్‌ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రషీద్ ఖాన్ అవతరించాడు.
ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది వీరే
👉రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 10 మ్యాచ్‌లలో కలిపి 14 వికెట్లు
👉భువనేశ్వర్ కుమార్ (భారత్)- 6 మ్యాచ్‌లలో కలిపి 13 వికెట్లు
👉అమ్జద్ జావేద్ (యూఏఈ)- 7 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు
👉వనిందు హసరంగ (శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు
👉హార్దిక్ పాండ్యా (భారత్)- 10 మ్యాచ్‌లలో కలిపి 12 వికెట్లు.
ఆఖరి వరకు పోరాడినా..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గనిస్తాన్ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.
అఫ్గన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్ (30) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో చెలరేగగా.. సనూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక అఫ్గన్‌కు సూపర్-4 ఆశలు సజీవంగా ఉండాలంటే.. తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను తప్పక ఓడించాలి.
చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
Rashid Khan proves his genius, even in a loss 🌟
Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/voUMwhtD2g— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025