
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో శ్రీలంక అనామక హాంకాంగ్ జట్టుపై గెలిచేందుకు శ్రమించింది. సోమవారం గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నిజాకత్ (38 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్షీ రాఠ్ (46 బంతుల్లో 48; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో లంక ఇబ్బంది పడింది.
హాంకాంగ్ నిర్ణీత ఓవర్ల కోటాలో కేవలం 4 వికెట్లను కోల్పోతే... శ్రీలంక 20 ఓవర్లయినా ఆడకముందే 6 వికెట్లను కోల్పోయింది. 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ నిసాంక (44 బంతుల్లో 68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు.
19వ ఓవర్లో హసరంగ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) వరుస బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్‌లో యూఏఈ 42 పరుగుల తేడాతో ఒమన్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో బంగ్లాదేశ్ ఆడుతుంది.