Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు!

Asia Cup 2022: Saba Karim Says There Is No Place For Pant In Playing XI Now - Sakshi

Asia Cup 2022- Rishabh Pant: ఆసియా కప్‌-2022 టోర్నీలో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చని మాజీ సెలక్టర్‌ సబా కరీం అభిప్రాయపడ్డాడు. మిగిలిన మ్యాచ్‌లలో కూడా టీమిండియా.. దినేశ్‌ కార్తిక్‌తోనే బరిలోకి దిగుతుందని అంచనా వేశాడు. కాగా మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన భారత తుది జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.

పంత్‌ను కాదని!
పంత్‌ను కాదని అనుభవజ్ఞుడైన, ఫినిషర్‌గా ఆకట్టుకుంటున్న దినేశ్‌ కార్తిక్‌(డీకే) వైపే యాజమాన్యం మొగ్గుచూపింది. అందుకు తగ్గట్టుగానే వికెట్‌ కీపర్‌ డీకే.. పాక్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఫఖర్‌ జమాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, నవాజ్‌లను పెవిలియన్‌కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఆకట్టుకున్న జడేజా!
మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. తద్వారా జట్టు విజయంలో కీలకంగా మారాడు ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌. ఈ నేపథ్యంలో సబా కరీం.. పంత్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎడమచేతి వాటం గల బ్యాటర్‌కు మున్ముందు అవకాశాలు కష్టతరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

పంత్‌కు చోటు కష్టమే!
ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘టీ20లలో భారత తుది జట్టులో పంత్‌కు చోటు కష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా కాకపోయినా.. ఆసియా కప్‌ వరకైనా టీమిండియా దినేశ్‌ కార్తిక్‌నే వికెట్‌ కీపర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే నాలుగో స్థానంలో రవీంద్ర జడేజాను పంపాలని నిర్ణయించుకున్నారు. జడ్డూ సైతం పాక్‌తో మ్యాచ్‌లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.

అంతేకాదు నాలుగో స్థానానికి తాను సరిపోతానని నిరూపించాడు. ఐదో స్థానంలోనూ ఈ లెఫ్టాండర్‌ రాణించగలడు. ఇక లోయర్‌ ఆర్డర్‌ గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో లెఫ్టాండర్‌ బ్యాటర్‌ పంత్‌కు అవకాశం ఇవ్వాలంటే డీకే తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ.. అతడిని వికెట్‌ కీపర్‌గా ఆడిస్తున్నారు.

రాహుల్‌ను తప్పిస్తే తప్ప!
ఫినిషర్‌గానూ పని పూర్తి చేయగలడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశమే కనిపించడం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పేలవ ఫామ్‌ కొనసాగితే.. ఓపెనర్‌ స్థానం ఖాళీ అయితే తప్ప పంత్‌కు ఛాన్స్‌ రాదని అభిప్రాయపడ్డాడు.

అయితే, పాక్‌తో మ్యాచ్‌కు ముందు సబా కరీం తన అభిప్రాయాలు పంచుకుంటూ.. రిషభ్‌ పంత్‌ను ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. ‘‘ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్‌ను పక్కన పెడతారని ఎవరూ అనుకోరు.

నాకైతే దినేశ్‌ కార్తిక్‌ కంటే ఇప్పటికీ తనే బెటర్‌ అనిపిస్తాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, కొన్నిసార్లు జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది ఆటగాళ్లు త్యాగం చేయాల్సి ఉంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక హాంకాంగ్‌తో టీమిండియా ఆసియా కప్‌ ఈవెంట్‌లో దుబాయ్‌ వేదికగా బుధవారం(ఆగష్టు 31)తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది. 
చదవండి: Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top