
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
‘డ్రీమ్ 11’తో కటీఫ్
కాగా ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ ఇటీవలే భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్’ను అనుసరించి.. డ్రీమ్ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది.
ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్లు
అయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్‌లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్ 11 జెర్సీ స్పాన్సర్‌గా ఉండి.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది.
కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్, బిర్లా ఓప్టస్ పెయింట్స్ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్ తమ బిడ్‌ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.