Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమిపాలైంది. అయితే మ్యాచ్‌లో కెప్టెన్ రహానే 10 బంతులాడి 8 పరుగులే చేయడం విమర్శలకు దారి తీసింది. అయితే రహానే మాత్రం తనపై వచ్చిన విమర్శలకు ధీటుగానే బదులిచ్చాడు.
తన సక్సెస్‌ను చూడలేకనే కొంతమంది తన స్ట్రైక్‌రేట్ విషయంలో ఒక అజెండాతో విమర్శలు చేస్తున్నారని రహానే తెలిపాడు. కేవలం ఒక్క మ్యాచ్‌లో విఫలం కావడంతోనే విమర్శలు చేయడం సరికాదన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కేకేఆర్(KKR) కెప్టెన్ రహానే మీడియాతో మాట్లాడాడు.
‘2023 నుంచి నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ అత్యుత్తమంగా ఉందని నేను భావిస్తున్నా. అయితే నా బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడుతున్న వారంతా బహుశా నా ఆటను చూడకపోవచ్చు లేదంటే ఒక అజెండాతో నాపై నెగెటివ్ వ్యాఖ్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నార నిపిస్తుంది. వాస్తవానికి నేను ఆడడం వారికి ఇష్టం లేదనుకుంటా. అందుకే నా ఆటను చూసేందుకు ఇష్టపడడం లేదు.
నా సక్సెస్ చూసి వారికి అసూయ కలిగినట్లు అనిపిస్తోంది. కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే చూసి నేను సరిగ్గా ఆడడం లేదని పేర్కొనడం తగదు. అజింక్యా రహానే ఆటను మార్చుకున్నాడంటే అస్సలు సహించడం లేదు. అంతిమంగా రహానే గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అది పాజిటివ్ లేదా నెగెటివ్ కావచ్చు. ఏదైనా సరే నేనేమీ మాట్లాడుకుండా వారిని అడ్డుకోను.’అని చెప్పుకొచ్చాడు.
కాగా అజింక్యా రహానే 2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌లో చేరిన తర్వాత తన ఆటను పూర్తిగా మార్చుకున్నాడు. హిట్టింగ్‌కు అధిక ప్రాధాన్య మిచ్చిన రహానే ఆ సీజన్‌లో సీఎస్‌కే తరఫున 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో చెన్నై టైటిల్ కొట్టడంలోనూ రహానే ఓపెనింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. అయితే 2024 సీజన్ రహానేకు అంతగా కలిసిరాలేదు. 2024లో రహానే 123.47 స్ట్రైక్‌రేట్‌తో 242 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో రహానేను సీఎస్‌కే విడుదల చేయడంతో 2025 సీజన్‌కు ముందు అతడిని కేకేఆర్ కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో రహానే మరోసారి మెరిశాడు. కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గా 13 మ్యాచ్‌ల్లో 147 స్ట్రైక్‌రేట్‌తో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2026 ఐపీఎల్ సీజన్‌ను కూడా రహానే మంచి ఈజ్‌తో ప్రారంభించాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అర్థసెంచరీ సాధించి తన విలువను చాటిచెప్పాడు.
Ajinkya Rahane did not hold back in the post-match press conference 😮#KKRvsSRH #IPL2026 pic.twitter.com/b9IxVcrQJZ
— Cricbuzz (@cricbuzz) April 2, 2026


