
ఒక ఓవర్‌లో 18 పరుగుల సమర్పించుకుంటే అది పెద్ద వార్త కాకపోవచ్చు.. కానీ ఒక్క బంతికి 18 పరుగులు ఇచ్చుకుంటే మాత్రం అది సంచలనమే అవుతుంది. సలేమ్ స్పార్టాన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ ఈ పుణ్యం మూటగట్టుకొని అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఇది చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి సలేమ్ స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ సూపర్ గల్లీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ బౌలింగ్ చేశాడు. క్రీజులో సంజయ్ యాదవ్ ఉన్నాడు. ఓవర్లో మొదటి నాలుగు బంతులు కరెక్ట్‌గా వేసిన అభిషేక్ తన్వర్ ఆరు పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాతి బంతి నోబాల్.. ఆ తర్వాత బంతికి ఒక పరుగు వచ్చింది. దీంతో ఐదు బంతుల్లో ఎనిమిది పరుగులు వచ్చినట్లయింది.
ఇక ఓవర్ చివరి బంతి వేయడానికి నానా కష్టాలు పడ్డాడు. తొలుత నోబాల్, ఆ తర్వాత నోబాల్ వేస్తే ఈసారి సిక్సర్, తర్వాతి బంతి మళ్లీ నోబాల్.. రెండు పరుగులు.. అనంతరం వైడ్ బాల్.. ఇక చివరగా వేసిన సరైన బంతికి మరో సిక్సర్.. ఇలా కేవలం ఆఖరి బంతికి మూడు నోబాల్స్, ఒక వైడ్ సహా రెండు సిక్సర్లు, రెండు పరుగులు మొత్తంగా 18 పరుగులు వచ్చాయి. ఈ దెబ్బతో సంజయ్ యాదవ్ కేవలం ఆఖరి ఓవర్లోనే తాను ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 18 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
One ball
— Cricket Insider (@theDcricket) June 13, 2023
18 runs 🤑#TNPL2023 pic.twitter.com/GcN9E8XyoP
ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెపాక్ సూపర్ గల్లీస్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గల్లీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రదోష్ పాల్(55 బంతుల్లో 88 పరుగులు, 12 ఫోర్లు, ఒక సిక్సర్), నటరాజన్ జగదీశన్ 27 బంతుల్లో 35, అపరాజిత్ 19 బంతుల్లో 29 పరుగులు, సంజయ్ యాదవ్ 12 బంతుల్లో 31 పరుగుల నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సలెమ్ స్పార్టాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. ముహ్మద్ అద్నాన్ ఖాన్ (15 బంతుల్లో 47 నాటౌట్, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ మినహా మిగతావారు విఫలమయ్యారు.
చదవండి: విండీస్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్‌గా ఆఖరిది కానుందా?