క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..

30 Years 1 Ball 22 Runs South Africa Vs Eng 1992 World Cup Semi Final - Sakshi

ఒక బంతి.. 22 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అదో చెత్త నిర్ణయంగా మిగిలిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌తో దురదృష్టానికి దగ్గరగా.. అదృష్టానికి దూరంగా నిలిచిపోయింది సౌతాఫ్రికా. నిషేధం తర్వాత ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆ మ్యాచ్‌ ఒక చీకటి రోజు. 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే లెక్కలు వేసి మరి దక్షిణాఫ్రికాను ఇంటి దారి పట్టేలా చేశారు.  ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో సఫారీ టీం తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి.


అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా... ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్ టార్గెట్ ను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే పెద్ద ట్విస్ట్ సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేసింది.

మైదానంలో ఉన్న స్క్రీన్ పై సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం  చేయకుండా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. పాపం అంపైర్లు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కొత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది.  అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను  ఐసీసీ తొలగించింది.  1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమల్లోకి వచ్చింది. ఈ మ్యాచ్ సరిగ్గా మార్చి 22 ,1992న జరగ్గా.. సరిగ్గా నేటితో 30 ఏళ్లు పూర్తైంది.

చదవండి: IPL 2022: టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top