ఆసీస్‌ భారీ స్కోర్‌.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా | India A vs Australia A: Openers Shine After Visitors Post 532 in First Innings | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ భారీ స్కోర్‌.. ధీటుగా బదులిస్తున్న టీమిండియా

Sep 17 2025 4:54 PM | Updated on Sep 17 2025 5:01 PM

1st Unofficial Test With Australia: India A Trail By 416 Runs At Day 2 Stumps

స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం లభించింది. ఓపెనర్లు అభిమన్యు ఈశర్వన్‌ (44), ఎన్‌ జగదీసన్‌ (50 నాటౌట్‌) తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. అనంతరం అభిమన్యు ఈశ్వరన్‌ను లియామ్‌ స్కాట్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

ఈశ్వరన్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సాయి సుదర్శన్‌ (20 నాటౌట్‌) జగదీసన్‌తో కలిసి బాధ్యతగా ఆడుతున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయమైన 28 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ దశలో వర్షం దంచికొట్టడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత-ఏ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 116 పరుగులుగా ఉంది.

అంతకుముందు ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌ను 532 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ (109), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (123 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్‌ కెల్లావే (88), కూపర్‌ కన్నోల్లీ (70), లియమ్‌ స్కాట్‌ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. 

భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆసీస్‌ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీమిండియాకు ఆడిన ప్రసిద్ద్‌ కృష్ణ (16-0-86-0), ఖలీల్‌ అహ్మద్‌ను (15-0-80-1) ఆసీస్‌ బ్యాటర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు. తనుశ్‌ కోటియన్‌కు (21-2-119-0) చుక్కలు చూపించారు. హర్ష్‌ దూబే (27-1-141-3), గుర్నూర్‌ బ్రార్‌ (19-2-87-2) వికెట్లు తీసినా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా భారత బౌలర్లను ఆసీస్‌ బ్యాటర్లు ఆటాడుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement