ముందస్తు నిర్మాణాలకు పెట్టుబడి పెట్టలేక పూరి గుడిసెల్లోనే ఆవాసం ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలంటున్న లబ్ధిదారులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో గుడిసెలు లేని గ్రామాలను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం ఒకెత్తయితే, క్షేత్రస్థాయిలో మంజూరైన లబ్ధిదారుల పరిస్థితి మరోలా ఉంటోంది. మండల పరిధిలోని కాసులాబాద్‌లోని బుడగ జంగాల లబ్ధిదారుల చేతిలో చిల్లి గవ్వ లేక ఇందిరమ్మ ఇంటి కల కలలాగానే మిగిలిపోతోంది.
మిరుదొడ్డి(దుబ్బాక)
ఇందిరమ్మ గూటి నిర్మాణానికి ముందస్తు పెట్టుబడి పెట్టలేక నిర్మాణాలకు నోచుకోలేకపోతున్నారు. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో 25 కుటుంబాలకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన లబ్ధిదారులు కూలీ నాలీ పనులు చేసుకుంటేనే ఏ పూటకు ఆ పూట తిండి గింజలు సంపాదించుకుంటారు. ఇక మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ముందస్తు డబ్బులు పెట్టి నిర్మించడానికి చిల్లి గవ్వ లేకపోవడంతో వారి సొంత గూటి కల కలగానే మిగిలిపోతోంది. దీంతో మంజూరైన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారుల పేర్లు రికార్డులకే పరిమితమైపోతోంది.
ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు రావాలంటే ముందస్తు నిర్మాణానికి తమ వద్ద డబ్బులు లేక మొదలు పెట్టడం లేదని వాపోతున్నారు. ఇంటి నిర్మాణం మొదలు పెడితే ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలకు తోడు, మరో రూ.12 లక్షలు ఉంటేనే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిండి గింజలకే అహర్నిశలు అష్టకష్టాలు పడుతున్నామని, ఇక ఇంటి నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని మధనపడుతున్నారు. తమకున్న ఖాళీ స్థలంలోనే ప్రభుత్వ ఖర్చులతోనే ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని బుడగ జంగాల ప్రజలు కోరుతున్నారు.
ఇల్లు మంజూరైనా రికార్డుల్లోనే


