హెచ్‌ఎంగా కోటయ్య నియామకం డిప్యుటేషన్‌పై మరో ఇద్దరు ఉపాధ్యాయులు అందరి సహకారం కోసం వారి కృషి బడిలో చేరాలంటూ ఇంటింటా ప్రచారం తరగతుల నిర్వహణకు సర్వం సిద్ధం
చేర్యాల(సిద్దిపేట): ఘనచరిత్ర కలిగిన చేర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో 2019లో మూసివేశారు. దీంతో అక్కడి ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపించారు. అయితే మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చేర్యాల ఉన్నత పాఠశాలను పునఃప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా దూల్మిట్ట మండలం కూటిగల్‌తండా ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం కోటయ్యని ఈ పాఠశాలకు(పూర్తి అదనపు బాధ్యతలు) ప్రధానోపాధ్యాయుడిగా నియమించారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపాధ్యాయుల కృషి
హెచ్‌ఎం కోటయ్య, ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలను తిరిగి ప్రారంభించడానికి దారులు వెతకడం మొదలు పెట్టారు. అందులో భాగంగా స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ, పాలకవర్గ సభ్యులను కలిసి తమకు సహకరించాలని కోరారు. అందుకు చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. అలాగే పూర్వవిద్యార్థులను కూడా కలిసి తమ వంతు సహకారం అందించాలని కోరారు. పాఠశాలకు పూర్వ వైభవాన్ని సంతరింప చేయడానికి కృషిని ముమ్మరం చేశారు.
సర్వం సిద్ధం
పాఠశాల నూతన బోర్డు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన రెండు గదులను కేటాయించేలా చూశారు. తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. బడిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించి జాతీయజెండా ఆవిష్కరించారు.
6, 7, 8వ తరగతులు ప్రారంభిస్తాం..
సుమారు ఏడేళ్ల క్రితం మూతబడ్డ పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు సహకారంతో ముందుకు వెళ్తున్నాం. హెచ్‌ఎంగా నాతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్ నియమించారు. ఇప్పటికే కొంత మంది తల్లిదండ్రులను కలిశాం. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు సహకరించి పిల్లలను చేర్పిస్తే కనీసం మూడు తరగతులైనా ప్రారంభిస్తాం. పాఠశాల సమీప ప్రాంతాలైన బీడీ, గట్టుతోట కాలనీల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.
– కోటయ్య, ఇన్‌చార్జి హెచ్‌ఎం, చేర్యాల ఉన్నత పాఠశాల


