గజ్వేల్: పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఓ పేద విద్యార్థినికి ఒకే రోజు ఒకే సమయానికి ఇంటర్మీడియెట్ కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఉండటంతో అయోమయానికి గురవుతోంది. గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామానికి చెందిన హారిక ములుగులోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 508 మార్కులను సాధించారు. రిజల్ట్‌కు ముందే ఇంటర్మీడియెట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సదరు విద్యార్థినికి హాల్‌టికెట్లు కూడా వచ్చాయి. కేజీబీవీ ప్రవేశ పరీక్ష మే 3న ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు సిద్దిపేట మండలం తడ్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాయాల్సి ఉంది. టీజీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష సైతం అదే రోజు, అదే సమయానికి సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు మోడల్ పాఠశాలలో ఉన్నట్లు హాల్ టికెట్లు వచ్చాయి. ఈ రెండింటిలో ఏ పరీక్షకు హాజరు కావాలో తెలియక సదరు విద్యార్థిని తికమకపడుతున్నారు. ఒకే రోజు.. ప్రవేశ పరీక్షలను నిర్వహించడంలో సంబంధిత అధికారుల ఆంతర్యమేమిటో అర్థం కాని ప్రశ్నగా మారింది. వారి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు హారికలాగే ఆందోళన చెందుతున్నారు.
ఒకే సమయానికి టీజీఆర్‌జేసీ,
కేజీబీవీ ఎంట్రెన్స్ టెస్ట్‌లు
ఆందోళనలో టెన్త్ విద్యార్థులు


