తీరనున్న సాగునీటి కొరత | - | Sakshi
Sakshi News home page

తీరనున్న సాగునీటి కొరత

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): గోదావరి జలాల పరవళ్లతో యాసంగి పంటలకు సాగు నీటి కొరత తీరనుంది. జలసిరితో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సీజన్‌ కోసం అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి గోదావరి నీళ్లు రంగనాయక సాగర్‌లోకి పంపింగ్‌ను ఆదివారం ఇరిగేషన్‌ అధికారులు ప్రారంభించారు. దీంతో యాసంగిలో సాగు నీటి ఇబ్బంది తీరనున్నదని అన్నదాతలు సంబురపడుతున్నారు. రంగనాయక సాగర్‌లో 1 టీఎంసీ నీరు ఉండటంతో యాసంగి పూర్తయ్యే వరకు నీటిని అందజేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయం విదితమే. స్పందించిన అధికారులు ‘సాగర్‌’లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రంగనాయకసాగర్‌లో 1 టీఎంసీ మాత్రమే నీరు ఉందని, మరో టీఎంసీ నీటిని నింపడానికి అధికారులు సిద్ధమయ్యారు.

పెరగనున్న భూగర్భజలాలు

చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయక సాగర్‌ జలాశయం.. అన్నదాతల వెతలు తీర్చేందుకు ఎంతగానో దోహదపడుతోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా చెరువులు, కుంటలకు తద్వారా పంట పొలాలకు నీరందిస్తున్నారు. రంగనాయక సాగర్‌ కింద 1.10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఎడమ కాలువ 21.5 కిలోమీటర్లు, కుడి కాలువ 23.8 కిలోమీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా సిద్దిపేట అర్బన్‌, నంగునూరు, చేర్యాల, మద్దూరు మండలాలకు, ఎడమ కాలువ ద్వారా చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్‌, నారాయణరావుపేట, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీటిని అందిస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడంతో సాగుకు ఊతమిస్తోంది. వరి సాగు చేస్తున్న రైతులకు ప్రాజెక్టు దన్నుగా నిలుస్తోంది.

రంగనాయక సాగర్‌లోకి గోదావరి జలాలు

రైతుల్లో హర్షాతిరేకాలు రంగనాయక సాగర్‌ కింద 1.10 లక్ష ఎకరాల్లో సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement