● ప్రభుత్వ భవనం కనుకే సీఎం ఫొటో పెట్టాం
● డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
గజ్వేల్: ప్రభుత్వ భవనాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో ఉండాలనే లక్ష్యంగా తాము కూడా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టామని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గజ్వేల్‌లో టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీల చైర్మన్లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ భవన్‌గా సొంత ఆస్తిలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో, శాంతియుతంగా సీఎం ఫొటోను తాము క్యాంపు కార్యాలయంలో పెట్టామన్నారు. ఈ సందర్భంగా తాము ఎలాంటి దాడులు, విధ్వంసాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయం నిర్మించి ఏడేళ్లు దాటుతున్నా.. కేసీఆర్ ఇప్పటివరకు అడుగుపెట్టిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికై నా క్యాంపు కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలని డిమాండ్ చేశారు.
వంటేరుపై పోలీసులకు ఫిర్యాదు
కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటోను తొలగించిన వంటేరు ప్రతాప్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు స్థానిక ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కనకయ్యగౌడ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


