కలెక్టర్ హైమావతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని కలెక్టర్ హైమావతి అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి కలెక్టర్ వివిధ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించారన్నారు. ఒక నాయకుడు ఉన్నత స్థాయికి ఎదగాలంటే అనేక సవాళ్లను ఎదుర్కొని, సమస్యలను అధిగమించే ధైర్యం అవసరమన్నారు. మహనీయుల ఆశయాలు, కృషిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షించారన్నారు. మహిళల సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీవో సదానందం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీ ద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


