కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్‌ నేతలు ముట్టడించారని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పగిలిన క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం అద్ధాలను పరిశీలించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు మాదాసు శ్రీనివాస్‌, దేవీందర్‌, గంగిశెట్టి రవీందర్‌, కళ్యన్‌కర్‌ నర్సింగరావు, మల్లేశం, మధు, నవాజ్‌మీరా, నూనె కుమార్‌, ప్రశాంత్‌ తదితరులు నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలపై ఫిర్యాదు చేశారు. క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ గుండా రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయానికే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని 24గంటల్లో అరెస్ట్‌ చేయకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ ఘటనకు నిరసనగా ఈనెల 6న గజ్వేల్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటనల నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్తత నెలకొనడంతో కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్‌ గూండాయిజాన్ని సహించం

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌: గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ నేతలు గూండాయిజం ప్రదర్శించడం సహించరానిదని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే విధంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌ కార్యాలయంపైనే దాడి జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దౌర్జన్యాలకు పాల్పడడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. 24గంటల్లో గజ్వేల్‌ ఘటనకు బాధ్యులైన నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

గజ్వేల్‌: పట్టణంలోని కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం కేంద్రంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీగా సాగుతున్న రాజకీయాలు తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాజాగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో మార్కెట్‌ కమిటీల చైర్మన్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు సర్ధార్‌ఖాన్‌, ప్రభాకర్‌గుప్తా తదితరులు శనివారం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు.. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని సమావేశ మందిరంలో మొలలు కొట్టి గోడకు బిగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్‌ ప్రజలను పట్టించుకోని కేసీఆర్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి మండిపడ్డారు. పోలీసులు చేరుకొని కాంగ్రెస్‌ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ముట్టడి సందర్భంగా కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం అద్ధాలు పగిలిపోయాయి.

బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం,.. నిరసన

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

సీఎం ఫొటో పెట్టిన అధికార పార్టీ నేతలు

అనంతరం తొలగించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

పోటాపోటీగా ర్యాలీలు.. ఉద్రిక్తత

6న గజ్వేల్‌ బంద్‌కు బీఆర్‌ఎస్‌ పిలుపు

దాడులు, విధ్వంసం జరగలేదు

మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

గజ్వేల్‌: కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రభుత్వ ఆస్తిగా ఉన్న ఆ కార్యాలయంలో సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్లారని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గౌరవంగా వెళ్లి సీఎం చిత్రపటాన్ని పెట్టి వచ్చారే తప్ప అక్కడ ఎలాంటి దాడులు, విధ్వంసం జరగలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనను కొందరు వక్రీకరించి దాడిగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇది పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement