భూ సమస్యలకు చెక్‌..! | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు చెక్‌..!

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం లభించనుంది. భూ భారతి కింద భూముల సర్వే నిర్వహిస్తోంది. వ్యక్తులకు ఆధార్‌ కార్డు మాదిరిగానే భూ ఆధార్‌ నంబర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో 23 గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో రీ– సర్వేను ప్రారంభించారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో భూముల సర్వే నిర్వహించి ప్రతి భూ కమతానికి హద్దులుగుర్తించనున్నారు. – సాక్షి, సిద్దిపేట

జిల్లాలో అనేక గ్రామాల్లో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి సగానికి పైగా భూ సమస్యల వినతులే వస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సర్వేయర్ల కొరత ఉండేది. ఇటీవల జిల్లాల వారీగా సర్వేయర్లను కేటాయించడంతో ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి భూ ఆధార్‌ కార్డులు జారీ చేయనున్నారు. జిల్లాలో 23 గ్రామాల్లో 5వేల సర్వే నంబర్లు 61,365 ఎకరాల భూమిని రీ–సర్వేను ఇటీవల ప్రారంభించారు. డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజీషనింగ్‌ సిస్టం) ద్వారా సర్వే జరిపి ఆ వివరాలను భూ భారతి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు సైతం పరిష్కారం కానున్నాయి.

పకడ్బందీగా రీ సర్వే

రీ సర్వే నిర్వహించే గ్రామాల్లో ముందుగా గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కాలువలు, అటవీ భూములతో పాటు పట్టా భూములకు సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. అనంతరం సంబంఽధిత భూ యజమానులందరికీ సర్వేకు సంబంఽధించిన నోటీసులు పంపుతారు. నోటీసులు అందిన తర్వాత వివిధ విభాగాల నుంచి వచ్చే అభ్యంతరాలను సేకరించి, వాటిని పరిష్కరించిన తర్వాతే అసలు సర్వేను ప్రారంభించనున్నారు. ఒక సర్వే నంబరు ప్రాతిపదికగా తీసుకొని, అందులో మొత్తం ఎంత భూమి ఉంది. అది ప్రస్తుతం ఎవరెవరి పేర్లపై ఉందనే వివరాలను బై నంబర్లతో సేకరిస్తారు.

అత్యాధునిక టెక్నాలజీతో..

భూముల సరిహద్దులను పక్కాగా నిర్ణయించేందుకు డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(డీజీపీఎస్‌) రోవర్‌ మిషన్లను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌లను (ఎల్‌పీఎం) రూపొందిస్తున్నారు. ఒకే సర్వే నంబర్‌లో ఉన్న గందరగోళ బై నంబర్లను తొలగించి, ప్రతి భూ యజమానికి ఆధార్‌కార్డు తరహాలోనే ఒక ప్రత్యేక భూ ఆధార్‌ నంబరును కేటయించనున్నారు. దీని వల్ల ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన గుర్తింపు లభిస్తుంది. క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డులోని సమాచారానికి సరిపోలితేనే భూ భారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. భవిష్యత్‌లో ఆ భూమి సర్వే నంబర్‌, విస్తీర్ణం మార్చడం లాంటివాటికి ఆస్కారమే ఉండదు. పకడ్బందీగా భూముల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో సర్వేలు కొనసాగుతున్నాయని సర్వే అండ్‌ ల్యాండ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రీ సర్వే చేసే గ్రామాలివే..

సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గంగాపూర్‌( చిన్నకోడూరు),రంగంపేట్‌ (దౌల్తాబాద్‌),దుబ్బాక, రాజక్కపేట, తిమ్మాపూర్‌(దుబ్బాక), ఇర్కోడ్‌, రాఘవాపూర్‌, పుల్లూరు (సిద్దిపేట రూరల్‌), మురదాబాద్‌(నంగునూరు) గ్రామాలున్నాయి. గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గొల్లపల్లి, తీగూల్‌ నర్సాపూర్‌(జగదేవ్‌పూర్‌), చేబర్తి (మర్కూక్‌), లక్ష్మక్కపల్లి, శ్రీరాంపూర్‌, చీలాసాగరం, కోట్యాల్‌ ( ములుగు), చిన్నమాసాన్‌పల్లి(రాయపోల్‌), హుస్నాబాద్‌ పరిధిలో శ్రీరాములపల్లి, శనిగరం, కోహెడ(కోహెడ), కేశవపూర్‌, మల్లంపల్లి(అక్కన్నపేట) గ్రామాలను రీ సర్వే చేయనున్నారు.

భూ భారతిలో రీ సర్వేకు 23 గ్రామాల ఎంపిక

5వేల సర్వేనంబర్లు, 61వేల ఎకరాల్లో రీ– సర్వే

భూములకూ ఆధార్‌ నంబర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement