సిద్దిపేటజోన్: ఈనెల 22న కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభం నేపథ్యంలో యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవిష్కరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో కేదార్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మానవ సేవ మాధవ సేవగా అభివర్ణించారు. కేదార్‌నాథ్ యాత్రికులకు అన్న ప్రసాదం అందించడానికి ఈనెల 14న సాయంత్రం 4గంటలకు ఆహార పదార్థాలతో కూడిన వాహనాలను ప్రారంభించాలని సమితి నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, రత్నాకర్, మధుసూదన్, నవీన్, కాశీనాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ సంపదతో ఆర్థిక లబ్ధి
ములుగు అటవీ కళాశాల విద్యార్థి
విశేష పరిశోధన
ములుగు(గజ్వేల్): అటవీ సంపద కేవలం కలపకే పరిమితం కాదని, అది సమాజానికి పరోక్ష ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని ములుగు అటవీ కళాశాల పరిశోధక విద్యార్థి రావుల రోహిత్ నిరూపించారు. అటవీశాస్త్రంలో (సిల్వి కల్చర్, అగ్రో ఫారెస్ట్రీ) ఆయన చేసిన విశేష పరిశోధనకు గానూ ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ లభించింది. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి ‘పర్యావరణ సేవల ఆర్థిక మూల్యాంకనం’ అనే అంశంపై రోహిత్ తన పరిశోధనను కొనసాగించారు. అడవులు అందించే నీటి సరఫరా, కార్బన్ నిల్వ, మట్టి సంరక్షణ వంటి సేవలకు ఆర్థిక విలువ నిర్ధారణ చేసి అటవీ వనరుల అసలు ప్రాముఖ్యతను శాసీ్త్రయంగా నిరూపించారు. ఈ పరిశోధనకు డాక్టర్ మిల్కూరి చిరంజీవరెడ్డి మార్గదర్శకత్వం వహించారు. ప్రభుత్వం అటవీ సంరక్షణకు సరైన నిధులు కేటాయించేందుకు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ పరిశోధనలు కీలకంగా మారనున్నాయి. రోహిత్ సాధించిన ఈ విజయానికి ఎఫ్‌సీఆర్‌ఐ డీన్, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అటవీ విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో ములుగు ఎఫ్‌సీఆర్‌ఐ నుంచి వస్తున్న ఇలాంటి పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.
ప్రశ్నించే మహిళే
మహనీయురాలు
ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
హుస్నాబాద్: అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, మార్పు కోసం పోరాడే ప్రతీ మహిళ మహనీయురాలేనని ప్రజాస్వామిక రచయిత్రిల వేదిక జాతీయ సమన్వయకర్త, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా కాత్యాయనీ విద్మహే పాల్గొని మాట్లాడారు. మహిళలకు చదువుతోపాటు స్వతంత్రంగా ఆలోచించే శక్తి, ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. ఆత్మస్థైర్యం లేకపోవడమే మహిళల ప్రధాన బలహీనతని చెప్పారు. వరకట్న వేధింపుల నుంచి మొదలుకుని సామాజిక వివక్ష వరకు ప్రతీ దానిని ఎదురించే ఆత్మరక్షణ ప్రేరణ మహిళల్లో కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సామాజిక వివక్ష, అవినీతి తగ్గకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం అంటే కేవలం వేడుక కాదని, హక్కుల పోరాటమని అభివర్ణించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, హైకోర్టు సీనియర్ న్యాయవాది వసుధ నాగరాజు, జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కో ఆర్డినేటర్లు వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, కౌన్సిలర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


