వెంచర్‌ వేసి.. | - | Sakshi
Sakshi News home page

వెంచర్‌ వేసి..

Mar 30 2026 12:03 PM | Updated on Mar 30 2026 12:03 PM

కాలువను పూడ్చి..

అనుమతి లేకుండా ఏర్పాటు

ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు

జీపీ తీర్మానాన్ని లెక్కచేయని కార్యదర్శి

కొండపాక(గజ్వేల్‌): అక్రమ వెంచర్ల ఏర్పాటుతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా చర్యలు ఎవరూ పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో ఆరేళ్ల కిందట ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్‌ ఏర్పాటు చేశారు. సర్వే నంబర్లు 3/ఆ/1, 3/ఆ/2, 343/ఆ, 344/2, 335/ఆ/3 లోని సుమారు 3.32 ఎకరాల వ్యవసాయ భూమిలో వెంచర్‌ వేసి ప్లాట్ల రూపంలో సుమారు 90 శాతం విక్రయించారు.

నిర్లక్ష్యంగా కార్యదర్శి

వెంచర్‌లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం ఏ మాత్రం భూమిని వదిలిపెట్టకుండా ప్లాట్లు వేసి విక్రయించారు. కొందరు అప్పట్లోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మరి కొందరు ప్రస్తుతం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ అక్రమ లేఔట్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దంటూ సర్పంచ్‌ శిల్పతో పాటు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేశారు. ఆ పనిని పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. కానీ ఆ తీర్మానాన్ని లెక్క చేయకుండా వ్యవహరించడంతో కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని సర్పంచ్‌ శిల్ప తెలిపారు.

అధికారుల పరిశీలన

రైతులు, గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్‌శాఖ ఏఈ శ్రీనివాస్‌, ఎంపీఓ విష్ణు వెంచర్‌ ప్రదేశాన్ని, ఇళ్ల నిర్మాణ తీరును నెల రోజుల క్రితం పరిశీలించారు. వర్షపు నీరు బయటకు పోయేలా ఇది వరకు ఉన్న ఫీడర్‌ చానల్‌ కాలువ నిర్మించేలా చూడాలని ఇరిగేషన్‌శాఖ ఏఈ శ్రీనివాస్‌కు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాటును రెగ్యులరైజేషన్‌ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు చేసుకునేలా చూసుకోవాలని ఎంపీఓ విష్ణు పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ విషయపై డీఎల్‌పీఓ లతను వివరణ కోరగా ఈ వెంచర్‌ విషయంపై విచారణ చేయిస్తామని చెప్పారు.

గోడ నిర్మించి..

కానీ వ్యవసాయ భూమిని నాన్‌ అగ్రికల్చరల్‌ భూమిగా మార్చుకొనేందుకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతిని పొందలేదు. వెంచర్‌ వేసిన భూమికి సుమారు 500 గజాల దూరంలో మల్లారెడ్డి చెరువు ఉంది. వర్షాకాలంలో చెరువులో నుంచి వరద నీరు పోయేందుకు ఈ వెంచర్‌ వేసిన భూమిలోంచి ఫీడర్‌ చానల్‌ కాలువ ఉండేది. ఆ కాలువను పూడ్చి వేశారు. అలాగే అడ్డంగా రాతితో గోడ నిర్మించారు. దీంతో వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చే నీరు వెంచరుపై భాగంలో ఉన్న వ్యవసాయ భూముల్లో నిలిచిపోతోంది. పంట నీట మునిగిపోతుండంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement