హుస్నాబాద్‌రూరల్: స్వశక్తి సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలకు ఆదివారం ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినట్లు ఏపీఎం తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ చదవడం, రాయడం రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సెర్ప్ సహకారంతో మహిళ సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. వారికి వాలంటీర్లను నియమించి అక్షరాలు నేర్పించి పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. 17 గ్రామాల్లో 606 మంది మహిళలు ఆయా గ్రామాల్లో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. మిగతా మహిళలంతా కూడా రాయడం నేర్చుకోవాలని సూచించారు.
నంగునూరు(సిద్దిపేట): ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముదిగొండ రమేశ్, ఉపాధ్యక్షుడిగా నకీర్తి రాజమల్లు, ప్రధాన కార్యదర్శిగా మల్లమారి శంకర్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్‌ఎంపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తాన్నారు.
మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్య ఆర్గనైజేషన్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మిరుదొడ్డిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోయాలన్నారు. కార్యక్రమంలో ఐలయ్య, నునిగాని రాజు, బీజేపీ జిల్లా నాయకుడు ఎల్ముల దేవరాజు, టెలికం బోర్డు సభ్యుడు మల్లేశం, వార్డు సభ్యులు రాజు, సదానందరెడ్డి, విజయ్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌రూరల్: ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పందిల్ల వార్డు సభ్యుడు పోలవేని మహేశ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పందిల్ల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ రమేశ్ ఆదివారం ప్రారంభించారు. ప్రయాణికులకు మినరల్ వాటర్ అందిస్తున్న మహేశ్ దంపతులను గ్రామస్తులు అభినందించారు.
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలో ఆదివారం మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మల్లగల్ల యాదగిరి కుటుంబానికి పలువురు నేతలు అండగా నిలిచారు. మృతుడి కుటుంబాన్ని పంచాయతీ పాలకవర్గం పరామర్శించి ఓదార్చారు. సర్పంచ్ మల్లం కనకవ్వ రూ.5 వేలు, ఉపసర్పంచ్ దొంతి సత్తయ్య రూ.5 వేలు, వార్డు సభ్యురాలు ప్రేమలత రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మేఘన ఫౌండేషన్ ట్రస్టు నిర్వాహకుడు మల్లం ఐలయ్య, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిస్క అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాములోరి శోభాయాత్ర
మిరుదొడ్డి(దుబ్బాక): శ్రీరామనవమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శనివారం రాత్రి రాములోరి రథోత్సవ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి రథోత్సవానికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రలో చిన్నారుల ఆట పాటలు, మహిళలు కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి.


