ఆధిపత్య పోరుతో.. చేజారే
అంతర్గత కుమ్ములాటలున్న చోట్ల అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు కారణంగానే పలు మున్సిపాలిటీలను వదులుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వం బలంగా ఉండి, అంతర్గత కుమ్ములాటలు లేని నియోజకవర్గాల్లోని బల్దియాలను కాంగ్రెస్ సునాయసంగా విజయం సాధించగలిగింది.
అగ్రనేతలున్న చోట్ల క్లీన్‌స్వీప్
బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లోని బల్దియాలను హస్తం పార్టీ సునాయసంగా కై వసం చేసుకోగలిగింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్–జోగిపేట మున్సిపాలిటీల్లో 20 కౌన్సిలర్ స్థానాలకు 16 చోట్ల విజయం సాధించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాల్లో వేసుకోగలిగింది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్‌లోనూ అత్యధిక కౌన్సిలర్ స్థానాలతో కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది.
ఐదు బల్దియాల్లో కలవని ‘చేతులు’..
బలమైన నాయకులున్న ఈ మూడు చోట్ల స్వతంత్రులుగానీ, ఎంఐఎం మద్దతు లేకుండానే సొంత మెజారిటీతో బల్దియాల్లో పాగా వేయగలిగింది.
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభాసుపాలైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఈ ఐదింటిలో ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ పార్టీ క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గం ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధుముదిరాజ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్ ఇక్కడ కీలకంగా ఉన్నారు. ఈసారి తాము సమన్వయంతో కలిసి పనిచేస్తామని కాటా, నీలం మధు చేసిన బహిరంగ ప్రకటనలు సోషల్‌మీడియా ప్రచారానికే పరిమితమైందే తప్ప.. క్షేత్రస్థాయిలో ఇద్దరి క్యాడర్ కలిసి పనిచేయలేదని ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. ఇక్కడ గట్టి పట్టున్న గాలి అనిల్‌కుమార్‌ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ ఇన్‌చార్జిగా నియమించారు. అక్కడ పార్టీ విజయం సాధించింది. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఘెర పరాజయం పాలైంది. ఇద్దరు నాయకులు గాలి అనిల్‌కుమార్ వర్గం మద్దతు తీసుకుని ఉంటే ఫలితాలు కాస్త మెరుగ్గా వచ్చేవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సమన్వయం లేనిచోట్ల
బల్దియాలను కోల్పోయిన కాంగ్రెస్
బలమైన నాయకత్వమున్న చోట్ల భారీ మెజారిటీ
సొంత పార్టీ కౌన్సిలర్లతోనే చైర్మన్ పీఠాలు కై వసం
స్పష్టం చేస్తున్న మున్సిపల్ ఫలితాలు
ఆ రెండు మున్సిపాలిటీల్లో రచ్చ
జహీరాబాద్ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి రచ్చకెక్కింది. ఇక్కడ చంద్రశేఖర్‌తోపాటు, ఎంపీ సురేశ్‌షెట్కార్, సెట్విన్‌కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి ఇలా పార్టీ మూడు గ్రూపులుగా మారింది. ఈ మున్సిపాలిటీ టికెట్లను మాజీమంత్రి చంద్రశేఖర్ అనుచరుడు ప్రకటించడం పెద్ద రచ్చకు దారితీసింది. ఈ పంచాయితీని టీపీసీసీ అధిష్టానం కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఫయిమ్‌ఖరేషీని ఆ పార్టీ రంగంలోకి దించాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపుల నుంచి మొదలుకుని, చైర్మన్ ఎన్నిక వరకు ఖురేషీ ఈ మూడు వర్గాలను సమన్వయం చేయాల్సి వచ్చింది. ఇక్కడి చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ..బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు దక్కాయి. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు లేకపోతే ఈ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ వదులుకోవాల్సి వచ్చేది.


