రంగంలోకి సినీనటులు! | - | Sakshi
Sakshi News home page

రంగంలోకి సినీనటులు!

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

రంగంలోకి సినీనటులు!

రంగంలోకి సినీనటులు!

జోరుగా వాయిస్‌ వీడియోలు

గజ్వేల్‌లో ప్రచారం కొత్తపుంతలు

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారపర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన మార్గాలపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఇందుకోసం సినీనటుల వాయిస్‌ వీడియోలను వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేయిస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలంగా పట్టణ ప్రముఖులచే వాయిస్‌ వీడియోలను చేయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. – గజ్వేల్‌

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న తరుణంలో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జనసేన, గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెండెంట్లు కలుపుకొని మొత్తంగా 88 మంది అభ్యర్థులు మున్సిపల్‌ బరిలో ఉన్నారు. ప్రచారంలో ఎవరికి వారే తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఓటర్లను ఆలోచింపజేయడానికి కొందరు తమ సన్నిహిత సినీనటులను రంగంలోకి దింపుతున్నారు. పట్టణంలో పోటీలో ఉన్న ఓ అభ్యర్థి గబ్బర్‌సింగ్‌ సినిమా నటులతో వాయిస్‌ వీడియోలు చేయించి స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అంతేకాకుండా జబర్దస్త్‌ ఆర్టిస్టులు సైతం వచ్చి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

వీడియోలు షేర్‌ చేస్తూ..

గజ్వేల్‌ పట్టణానికి చెందిన ప్రముఖుల వీడియోలు తయారు చేయించి వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రముఖుల మాటలు ఇక్కడి ప్రజలను ప్రభావితం చేస్తాయనే భావనతో ఇలా చేస్తున్నారు. ప్రత్యేకించి పట్టణానికి చెందిన పురోహితులు, ఇతర పండితుల వీడియోల సందేశాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. వీరు ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని నేరుగా చెప్పకపోయినా.. వారు చెప్పే సందేశం తమకే వర్తిస్తుందనే భావనతో ఒకే వార్డులో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు తమ వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. ఇక పోతే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ మహిళా నాయకురాలి వాయిస్‌ను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఆ మహిళా నాయకురాలు మున్సిపల్‌ ఎన్నికల్లో.. ‘ఆపతికి, సంపతికి.. మన వెంటే ఉండే వారిని, సమస్యలను పరిష్కరించే వారిని మాత్రమే ఎన్నుకోండి...’ అంటూ సందేశమిచ్చారు. ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ..

మరికొందరు అభ్యర్థులు తాము గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ వాల్‌పోస్టర్లు, వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలో ఓటర్లను ఆకట్టుకునే పాటలను జతచేసి పర్సనల్‌గా షేర్‌ చేస్తున్నారు. మొత్తానికి వివిధ రూపాల ప్రచారపర్వం అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement