విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ హైమావతి ● బస్తీ దవాఖాన ఆకస్మిక తనిఖీ
సిద్దిపేటకమాన్: విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్‌లోని బస్తీ దవాఖానను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ రెండు చోట్ల విధులు నిర్వహిస్తున్నారని, మధ్యాహ్నం 12గంటలకు మరో పీహెచ్‌సీ వెళ్లారని సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. నర్సింగ్ స్టాఫ్ బాలమణి ఒక్కరే ఉన్నారని, సపోర్టింగ్ స్టాఫ్ రమ్య లేరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్‌ను ఫోన్‌లో కలెక్టర్ ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సిద్దిపేటరూరల్: జిల్లాలో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో సీపీ రష్మీ పెరుమాళ్‌తో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంటిమామిడి నుంచి తొటపల్లి వరకు రాజీవ్ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో సూచికబోర్డులు, ట్రబుల్‌స్టిక్స్, ఐరన్ బారికేడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. కొమురవెల్లి కమాన్, దుద్దెడ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా ఉన్నందున వెంటనే భూసేకరణ చేపట్టి రోడ్డును సరిచేయాలన్నారు. కుకునూరుపల్లి వద్ద సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసి, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో పోలీస్, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, వైద్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సీపి సాధన రశ్మిపెరుమాల్‌తో కలిసి కలెక్టర్ కె. హైమావతి మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.


