టికెట్.. ప్లీజ్
ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు ● అన్ని పార్టీల్లోనూ సందడి ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రాజకీయాలు ఆసక్తికరం
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఆశావహులు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆలస్యమైతే రేసులో వెనుబడిపోతామనే భయంతో తమ పేరును ఖరారు చేయించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్
ఆశావహుల పైరవీలు ముమ్మరం
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన టికెట్‌ల కేటాయింపు పర్వం ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్ ముంచుకొస్తున్న వేళ.. ఆశావాహులు తమ పేర్లను అధికారికంగా ఖరారుచేయించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆలస్యమైతే రేసులో వెనుకబడిపోతామనే భావన వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే టికెట్ల సాధనకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
కసరత్తు జోరు..
అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభమైంది. అఽధిష్టానం ఒక్కో వార్డులో నలుగురు, లేదా ఐదుగురిని ఎంపిక చేసి అందులో ఎవరికి ఎక్కువగా గెలుపు అవకాలున్నాయో సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని అధికారికంగా ప్రకటన చేయాలని సూచించడంతో.. ఆమేరకు ముందుకుసాగుతున్నట్లు తెలిసింది. అధిష్టానం సూచనలు ఎలా ఉన్నా.. ఆశావాహులు మాత్రం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
హరీశ్‌రావు ఆదేశాలతో..
బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఎంపిక కసరత్తును మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలమేరకు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, పార్టీ పరిశీలకుడు రాధాకృష్ణ శర్మలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై సర్వేను కూడా చేశారు. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆశావాహులు సర్వే జాబితాలో తమ పేరు ఉందో...? లేదోనని నేతలు చుట్టూ తిరుగుతున్నారు. బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపిక తుది దశకు వచ్చినట్లు తెలుస్తున్నది. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పర్యవేక్షణలో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కసరత్తు నడుస్తోంది. త్వరలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ప్రచార కార్యక్రమాలకు సిద్ధం
ఎలాగైనా గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టు సాధించడానికి ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ మంగళవారం పట్టణంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ర్యాలీతోపాటు విజయ సంకల్ప సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సైతం భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టాయి. ఇకపోతే తమకు టికెట్ ఖాయంగా వస్తుందనే ధీమాలో ఉన్నా.. ఆశావాహులు ఇంటింటి ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు.


