చారిత్రక మలుపు.. దీక్షా దివస్‌ | - | Sakshi
Sakshi News home page

చారిత్రక మలుపు.. దీక్షా దివస్‌

Nov 28 2025 11:41 AM | Updated on Nov 28 2025 11:57 AM

చారిత్రక మలుపు.. దీక్షా దివస్‌

చారిత్రక మలుపు.. దీక్షా దివస్‌

మాజీ మంత్రి హరీశ్‌రావు సన్నాహక సభలో ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న వక్తలు

సిద్దిపేటజోన్‌: తెలంగాణ మలి విడత ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్‌ 29 అని, ఉద్యమ ఘట్టంలో చరిత్రాత్మకమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నవంబర్‌ 29 (దీక్షా దివస్‌) పురస్కరించుకుని గురువారం పొన్నాల శివారులో బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ దీక్ష, అమరుల త్యాగ ఫలితంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. నవంబర్‌ 29 లేనిదే డిసెంబర్‌9 ప్రకటన లేదని, డిసెంబర్‌ 9 ప్రకటన మేరకు జూన్‌ 2 ఫలితమన్నారు. జూన్‌2 లేకపోతే తెలంగాణ ఎక్కడిదని, రేవంత్‌ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్‌ దీక్ష ప్రారంభించగా, మద్దతుగా సిద్దిపేటలో 1,531 రోజులు దీక్ష శిబిరాన్ని నిర్వహించిన ఘట్టాన్ని గుర్తు చేశారు. దీక్ష శిబిరానికి గుర్తుగా పైలాన్‌ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కానీ మోడల్‌ బస్టాండ్‌ నిర్మాణంలో తీసివేసినట్లు చెప్పారు. ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాంపు కార్యాలయం ముందు పైలాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అట్టహాసంగా నిర్వహిద్దాం

ఈనెల 29న జిల్లా కేంద్రంలో దీక్షా దివస్‌ను అట్టహాసంగా నిర్వహించాలని హరీశ్‌రావు సూచించారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉదయం 10 గంటలకు బైక్‌ ర్యాలీ, తెలంగాణ అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. అమర వీరుల కుటుంబాలకు సన్మానం ఉంటుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నారు, నీరుపోసిన వ్యక్తి జయశంకర్‌ అని కొనియాడారు. రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర కేసీఆర్‌ పోషించినట్టు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శర్మ, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

త్వరలో పైలాన్‌కు శంకుస్థాపన

మరింత సుందరంగా చెరువులు

జిల్లా కేంద్రంలోని చెరువులను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, అందుకు సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎర్ర చెరువు, నర్సాపూర్‌ చెరువులను పరిశీలించారు. చెరువుల అభివృద్ధి కోసం మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. రెండు చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 6.34 కోట్లు కేటాయింపు చేసినట్లు పేర్కొన్నారు. ఎర్ర చెరువుకు రూ.3.14కోట్లు, నర్సాపూర్‌ చెరువుకు రూ.3.20కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెరువుల్లోకి మురికి నీరు వెళ్లకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి ,వేగవంతం చేయాలని సూచించారు. అలాగే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళాశాల అధికారులు, ప్రతినిధులతో వివిధ అంశాలపై అరా తీశారు. సమస్యలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. మూడు సార్లు ఏ ప్లస్‌ న్యాక్‌ గ్రేడింగ్‌ సాధించిన ఏకై క కళాశాల అని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement