ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
● కలెక్టర్ హైమావతి ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
సిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా జరిగే పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఇందుకు గురువారం నుంచి మొదటి విడత నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలుకు పోటీదారునితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారన్నారు. ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి ఆ పంచాయతీలో, వార్డు మెంబర్ అదే వార్డు ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలన్నారు. నామినేషన్ జనరల్ అభ్యర్థి రూ.2వేలు, రిజర్వ్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ)రూ. వెయ్యి, వార్డు మెంబర్స్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) రూ.250, ఇతరులు రూ.500 డిపాజిట్ చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీలలో 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.2 లక్షల 50 వేలు, తక్కువగా ఉంటే రూ. లక్షా 50 వేలు, వార్డు మెంబర్లు రూ.50 వేలు, రూ. 30 వేలు ఎన్నికల ఖర్చుగా నిర్ణయించినట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను రెండురోజుల ముందుగానే అందించాలని సూచించారు. ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల పరిశీలకులు నిర్ధారించిన తరువాతే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, సీపీఓ దశరథ్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పరిశీలకులతో కలెక్టర్ సమావేశం
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్.హైమావతి తన ఛాంబర్‌లో ఎన్నికల పరిశీలకులు కె.హరిత, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్.నిశాంతిలతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియపై చర్చించారు.
నిబంధనలు కచ్చితంగా పాటించాలి
గజ్వేల్: ఎన్నికల కమిషన్ నిబంధనలకనుగుణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం గజ్వేల్ మండలం అక్కారం, శ్రీగిరిపల్లి, దాతర్‌పల్లి, జగదేవ్‌పూర్ మండలం జగదేవ్‌పూర్, పీర్లపల్లి, ధర్మారం, గొల్లపల్లి, కొండాపూర్, దౌలాపూర్ క్లస్టర్ల పరిధిలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. ఎంపీడీలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
వంట తీరు ఇదేనా?
గజ్వేల్ మండలం అక్కారం జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బగారా అన్నం, తోట కూర పప్పు నాణ్యతను పరిశీలించగా, సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత పాఠశాల హెచ్‌ఎంలపైనే ఉందన్నారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి


