బెల్ట్‌షాపులను బంద్ చేయాల్సిందే..
● పురుగుల మందు డబ్బాలతో మహిళలు ఆందోళన ● నిర్వాహకులపై దాడికి యత్నం
అక్కన్నపేట(హుస్నాబాద్): బెల్ట్‌షాపులతో తమ భర్తలంతా తాగుబోతులుగా మారుతున్నారని, ఈ షాపులను వెంటనే బంద్ చేయకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతామని హెచ్చరిస్తూ సుమారుగా 50 మంది మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో శనివారం చోటుచేకుంది. సుమారు 40 నుంచి 50 మంది మహిళలు గ్రామంలోని బెల్ట్‌షాపుల నిర్వాహకుల ఇంటిపై దాడికి యత్నించారు. పలువురి ఇంటి ఎదుట పురుగుమందు డబ్బాలతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకొనే వరకు మద్యం తాగుతూనే ఉంటున్నారని, తమను నిత్యం వేఽధిస్తున్నారని వాపోయారు. నానా బూతులు తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు కంటతడి పెట్టారు. బెల్ట్‌షాపు నిర్వాహకులు రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఉద్దెర ఇస్తూ తమ భర్తలను తాగుబోతులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోతల సమయంలో మద్యం షాపులకు లక్షల కొద్దీ బాకీలు కట్టాలని గొడవలకు దిగుతున్నారని, దీంతో పుస్తెలతాడు, కమ్మలు లాంటివి అమ్మేస్తున్నార ని వాపోయారు. అధికారులు స్పందించి బెల్ట్ షాపులను బంద్ చేయించాలని డిమాండ్ చేశారు.
బెల్ట్ షాపులపై దాడి
అక్కన్నపేట మండలం గౌరవెల్లి, జనగామ గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ శనివారం దాడి చేశారు. వివిధ గ్రామాల్లోని నాలుగు బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 36 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. అనుమతి లేకుండా బెల్ట్‌షాపు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. సిబ్బంది కర్ణాకర్, ముడావత్ తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.


