ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సీపీ విజయ్ కుమార్‌తో కలిసి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురికే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవ్వరినీ అనుమతించవద్దని అధికారులు ఆదేశించారు. నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఆర్డీఓలకు అప్పీలు చేయవచ్చన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మండల కేంద్రాల్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.
భద్రత కట్టుదిట్టం
సీపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరేవరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో జిల్లాలోని వైన్ షాపులు, బార్లు మూసివేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్యా, సీపీఓ నాగేశ్వర్, జెడ్పీ సీఈఓ రమేశ్, ఆర్డీఓలు, ఏసీపీలు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు
కలెక్టర్ హైమావతి
అధికారులకు దిశానిర్దేశం


