రాజ్యాంగమే మనకు మార్గదర్శనం
సిద్దిపేటకమాన్: రాజ్యాంగమే మనకు మార్గదర్శనమని, అందరూ గౌరవించాలని అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జయప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కోర్టు భవనంలో బుధవారం లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఆమోదించిన రోజు నవంబర్ 26 అని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలన్నారు. రాజ్యాంగ ప్రవేశికను కోర్టు సిబ్బందితో న్యాయమూర్తి చదివించారు. అలాగే డిసెంబర్ 31న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు రాజీపడేట్లు చూడాలని పోలీసుశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సాధన, సంతోష్‌కుమార్, తరణి, పోలీసు అధికారులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


