ఇళ్ల మధ్యే మురుగు!
చెరువులను తలపిస్తున్న
మడుగులు
హుస్నాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నాలుగు సార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో జలదిగ్బంధానికి గురై పట్టణం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ వరద నీరు మాత్రం నిలిచిపోయి మురికి నీటి మడుగులు చెరువులను తలపిస్తున్నాయి.
హుస్నాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డుతోపాటు క్యాస కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వరద నీరు చేరి మురికి నీటి మడుగులుగా మారాయి. దాదాపు 3 నుంచి 4 ఎకరాల ఖాళీ స్థలంలో వరద నీరు చేరి 15 రోజులు గడుస్తున్నా... ఆ నీరు ఎటూ వెళ్లే దారి లేక మురికి నీటి చెరువుగా తయారైంది. జనావాసాల మధ్య పెద్ద ఎత్తున మురికి నీరు నిలువడంతో అందులో చెత్త చెదారం వేయడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో స్థానికులు దుర్వాసనను భరించలేకపోతున్నారు. రాత్రి సమయంలో విష పురుగుల భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ రోడ్డు నుంచే నిత్యం వందలాది మంది కూరగాయలు తీసుకెళ్లడానికి వచ్చేవారు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకొని వెళ్తున్నారు.
సెల్లార్లలో తగ్గని నీటి ఊట
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెయిన్ రోడ్డులోని సెల్లార్లు నీటిలో మునిగిపోయాయి. వరద నీటితో విలువైన సామాన్లు తడిసి దుకాణాదారులు తీవ్రంగా నష్టపోయారు. సెల్లార్లలో నిలిచిన నీటిని రోజుల తరబడి మోటార్లతో బయటకు తోడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మురికి నీటి మడుగులను ఆనుకొని ఉన్న సెల్లార్లలో ఇప్పటికీ నీటి ఊట తగ్గడం లేదు. దాదాపు 15 రోజుల నుంచి దుకాణాలు మూసేసి ఉన్నాయి. ఉదయం మోటార్లతో నీటిని బయటకు పంపడం, రాత్రి సమయంలో మళ్లీ ఊట పెరగడం పరిపాటిగా మారింది. ఖాళీ స్థలంలోని నీటిని పూర్తిగా బయటకు పంపిస్తే గాని ఊటలు తగ్గే అవకాశం ఉండదు. ఈ ఖాళీ స్థలం పక్కనే పోలీస్ స్టేషన్, టెలిఫోన్ ఎక్చేంజ్ భవనాలను పటేల్ కుంటలో నిర్మించడంతో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఖాళీ స్థలాల్లో నిలిచిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
నోటీసులు జారీ చేస్తాం
కూరగాయల మార్కెట్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నీటిని తొలగించాలని నోటీసులు జారీ చేశాం. కొందరి అడ్రస్ తెలువడం లేదు. ఖాళీ స్థలాల్లో ఉన్న మురికి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. నీటిని తొలగించకుంటే చర్యలు తీసుకుంటాం. ప్రజల ఇబ్బందులను తొలగిస్తాం.
–మల్లికార్జున్,
మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్
సెల్లార్లలో తగ్గని నీటి ఊటలు
15 రోజులుగా దుకాణాల మూసివేత
చెత్తాచెదారంతోవిజృంభిస్తున్న దోమలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఇళ్ల మధ్యే మురుగు!
ఇళ్ల మధ్యే మురుగు!


