పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ
తెలంగాణ అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి సువర్ణ
ములుగు(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి భూమిపై ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి డాక్టర్.సి.సువర్ణ పేర్కొన్నారు. శుక్రవారం ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎప్‌సీఆర్‌ఐ)లో పర్యావరణం, వ్యర్థాల నిర్వహణ అంశంపై కళాశాల డీన్ వి.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణీకరణ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, వ్యర్థాలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం అధికారులతో కలిసి సదస్సుకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్.డి.రాజిరెడ్డి మాట్లాడుతూ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే పద్ధతులు కనిపెట్టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పరిశోధకులు, విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డాక్టర్.ప్రియాంకవర్గీస్ మాట్లాడుతూ రెడ్యూస్–రీయూజ్–రీసైకిల్ నినాదాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాన్నారు. కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.ఎన్.ఎస్.శ్రీనిధి, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు,విద్యార్థులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


